17-04-2025 01:36:14 AM
రెండో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా
భర్త వెంట ఎంపీ ప్రియాంకగాంధీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: హరియాణాలోని షికోపూర్ భూ ఒప్పందం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. రెండో రోజు భర్త వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వాద్రా లోపలికి వెళ్తుండగా ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు. విచారణ జరిగినంత సేపు ప్రియాంక గాంధీ పక్క గదిలో కూర్చోవడం గమనార్హం. అనంతరం రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
నిత్యం ప్రజల కోసం పోరాడే గాంధీ కుటుంబంలో తాను భాగమని వాద్రా తెలిపారు. దీంతో తనను, కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో సోనియా, రాహుల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. అధికార పార్టీ ఎంతగా ఇబ్బంది పెడితే తాము అంత బలపడతామన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ మంగళవారమే నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన వెంటనే రాబర్ట్ వాద్రా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బుధవారం కూడా దాదాపు ఐదు గంటలకు పైగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది.