calender_icon.png 30 October, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్లకు సిమ్స్ సప్లు

30-08-2024 02:01:44 AM

  1. నగరంలో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ 
  2. 1,748 సిమ్‌కార్డులు, ఏడు మొబైల్స్ స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులను అందిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సూర వెంకటేష్ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. 2022లో ఉద్యోగం మానేసి హోల్‌సేల్ నిమ్మకాయల వ్యాపారం చేశాడు. వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. సైబర్ నేరగాళ్లకు ప్రీ యాక్టివేటేడ్ సిమ్‌కార్డుల సప్లు చేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చని ఆ దందాలోకి దిగాడు. ఇలా కడప జిల్లాలోని బద్వేల్‌లో ‘ఆర్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’లో యాక్టివేటేడ్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న సద్దాం హుస్సేన్‌ను కలిశాడు. 

ఒక్కో సిమ్‌కార్డుకు రూ. 400 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. నిందితులు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా సాధారణ పౌరుల నుంచి ఆధార్ కార్డు నకళ్లు తీసుకుని, వారి పేరుపై మరొక సిమ్‌ను మాన్యువల్‌గా యాక్టివేట్ చేయడం ప్రారంభించారు.  అలా ఇప్పటివరకు 2 వేలకు పైగా ప్రీ యాక్టివేటేడ్ ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు యాక్టివేట్ చేశారు. వెంకటేష్ ఒక్కో సిమ్‌ను రూ.800 చొప్పున చెన్నైకి చెందిన బాలకృష్ణన్ మణికందన్ అనే వ్యక్తికి విక్రయిం చేవాడు. మణికందన్ వాటిని  కాంబోడియాలో కాల్ సెంటర్ నడుపుతున్న రాజేష్ అనే వ్యక్తికి పంపించేవాడు.

అక్కడి నుంచి ఆ సిమ్స్ దేశ విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు చేరేవి. దీనిపై పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, ఈస్ట్‌జోన్ టీం అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సిమ్స్‌సరఫరాలో భాగస్వాములు అయిన నిందితులు సూర వెంకటేష్ (35), కడప జిల్లాకు చెందిన నల్ల ఇమామ్‌పాబ్‌గారి సద్దాం హుస్సేన్(28), నెల్లూరు జిల్లాకు చెందిన దానం విజయ్‌కుమార్(36), తిరుపతికి చెందిన గొడ్తాల గోవర్ధన్(33), చెన్నైకి చెందిన బాలకృష్ణన్ మణికందన్(35)ను  అరెస్ట్ చేశారు. వారి నుంచి 1748 సిమ్‌కార్డులు, ఏడు సెల్‌ఫోన్లు, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న అధికారులు, సిబ్బంది డీసీపీ అభినందించారు.