29-04-2025 12:51:07 AM
కరీంనగర్, ఏప్రిల్28(విజయక్రాంతి) : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో సోమవారం రోజున మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ల తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ... ఒక ప్రాంతీయ పార్టీ ఇలాగ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజితోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే గొప్పగా లక్షలాది మందితో సభను నిర్వహించడం తెలంగాణ రాష్ర్ట సాధకులు కేసీఆర్ కే దక్కిందన్నారు.
రజితోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందన్నారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యానికి ఆర్టిఏ ద్వారా మెసేజ్ లు పంపి సభ కు బస్సులు పంపకుండా ప్రభుత్వం అడ్డుకుందని, అయినా కూడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడకుండా బస్సులు పంపారని, వారికి బిఆర్‌ఎస్ పార్టీ పైన ఉన్న అభిమానమే ఇందుకు నిదర్శనం అన్నారు.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనలేదని, ఉద్యమ సమయంలో వారు ఇతర పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ర్టం కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిన్యాల మీద రాలేదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి, తెలంగాణ సాధించుకున్నామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని టిఆర్‌ఎస్ పార్టీ పైన కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మంత్రులు గ్రామాల్లో సభలు పెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు. చాతనైతే ఇదే ఎల్కతుర్తిలో మా సభకు వచ్చిన జనంలో సగం మందితో సభ పెట్టే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
ప్రజలు ప్రభుత్వం పై నమ్మకం కోల్పోయారని వారన్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రజల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ సభ కేవలం నాంది మాత్రమేనని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడి, పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కొత్తపెళ్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఉపసర్పం సుంకిశాల సంపత్ రావు, మాజీ కార్పొరేటర్లు, గందె మహేష్, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, నాంపల్లి శ్రీనివాస్, మర్రి సతీష్, నాయకులు గంగాధర చందు, నవాజ్ హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, లు తదితరులు పాల్గొన్నారు.