07-04-2025 08:36:28 PM
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుమన్...
మంచిర్యాల (విజయక్రాంతి): వరంగల్ జిల్లాలో ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ మహా సభను విజయవంతం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుతో కలిసి మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో, మందమర్రి మండలం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో చెన్నూర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి వేరువేరుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయోత్సవ సన్నాహక సమావేశాలలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు నియోజక వర్గానికి మూడు వేల మంది చొప్పున ముఖ్యమైన నాయకులు హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటి వరకు సాధించింది ఏమీలేదని, ప్రజలు ఇప్పుడే రేవంత్ పాలనను, నియోజక వర్గాలలో కాంగ్రెస్ ఎంఎల్ఏలను వ్యతిరేకిస్తున్నారన్నారు. బీజేపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈ సమావేశాలలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, డాక్టర్ రాజారమేష్, మాజీ ప్రజాప్రతినిధులు తిప్పని లింగయ్య, నల్మాసు కాంతయ్య, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.