సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి
సంగారెడ్డి, మే 16 (విజయ క్రాంతి)/ పటాన్‌చెరు : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. గురువారం కంది మండలంలోని ఇంద్రకరణ్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అధికారులు పలు సూచనలు చేశారు. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోల్లు వేగవంతం చేసి రైతుల నుంచి సేకరించిన ధాన్యిన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.
తడిసిన ధాన్యంను పరిశీలించి తీసుకోవాలన్నారు. రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రంలో గన్నీ బస్తాల కొరత ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకపోవాలన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, శిక్షణ కలెక్టర్ మనోజ్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కొండల్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టవలసిన కనీస వసతులకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు. గురువారం పటాన్‌చెరు మండలం కర్దనూరు, ఘనాపూర్, రుద్రారం ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని వంటగదులు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్, మైనర్ మరమ్మతులు, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలన్నారు. నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు. పనులను నాణ్యతగా చేయించుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదని పేర్కొన్నారు. పాఠశాలల్లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీల ఫ్యాన్లు, లైట్లు పెట్టాలన్నారు. మరుగుదొడ్లు, టాయిలెట్స్‌లలో మంచి టైల్స్ ఏర్పాటు చేయాలని, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా పిల్లలకు తాగునీరు అందేలా చూడాలన్నారు. అన్ని పాఠశాలల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు.
తలుపులు, కిటికీలు, ప్లోరింగ్ తదితర వాటిని రిపేర్ చేయించుకోవాలన్నారు. పాఠశాలల్లో పనులు చేపట్టకముందు, పనులు చేపట్టిన తరువాత ఫొటోలను తీయాలని అధికారులకు సూచించారు. ఎవ్వరు గోడ దూకి లోనికి రాకుండా ఉండేలా ఎత్తున ప్రహారీ గోడలను నిర్మించి, వాటిపై కంచెలను అమర్చాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఆటపాటలలో ప్రాధాన్యత ఇవ్వలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రుద్రారం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో చేపట్టవలిసిన పనులను అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, సురేశ్, తహసీల్దార్ రంగారావు, అధికారులు పాల్గొన్నారు.