09-02-2025 01:54:48 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ రాజధాని ఢిల్లీలో 2015 ఎన్నికల్లో 70 సీట్లకుగాను 67 సీట్లు గెలుచుకుని ఎంతో ఘనంగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమ్‌ఆద్మీ 2025 ఎన్నికల్లో ఘోరం గా ఓటమిపాలైంది. రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. కానీ ఈ ఎన్నికల్లో ఏకంగా ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి చెంద డం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి.
* ఢిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు ‘కాగ్’ తన నివేదికలో పేర్కొంది. శీష్‌మహల్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. డిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉండటంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపట్ల ఆగ్రహాన్ని తమ ఓట్ల ద్వారా చూపించి నట్టు తెలుస్తుంది.
* అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందనే వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వంటి అగ్రనేతలు జైలుకు వెళ్లారు. ఈ అంశం ఢిల్లీ రాజకీయాలను కుదిపేసింది. పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ఢిల్లీ ప్రజలు లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ హస్తముందని నమ్మినట్టు ఆయన ఓటమిని చూస్తే అర్థమవుతుంది.
* అరెస్ట్ తర్వాత ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఇది పార్టీలో నాయకత్వ అస్థిరతకు దారి తీసింది. అతిశీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది.
* ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్ తనపై అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. అలాగే పార్టీలో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి ప్రముఖులు రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి.
* ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఆప్ ఓట్లకు గండికొట్టినట్టు తెలుస్తుంది. ఆప్‌కు పడాల్సిన ఓట్లను ఈ రెండు పార్టీలు చీల్చడంతో చాలా స్థానాల్లో చాలా స్వల్ప మెజారిటీతో ఆప్ అభ్యర్థులు ఓటమిని మూటకట్టుకున్నారు.
* వీటితోపాటు యమునా నది కాలుష్యం అంశం కూడా ఎన్నికల్లో ఆప్‌కు నష్టం కలిగించింది. యమునా నదిని హర్యానా విషతుల్యం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించగా ఈ ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది. తాను యమునా నీటినే తాగుతానంటూ ఏకంగా ప్ర ధాని నరేంద్రమోదీ ప్రకటించారు. హర్యానా సీఎం కూడా దీనిపై కౌంటరిచ్చారు.