calender_icon.png 21 September, 2024 | 4:51 PM

చైనా జూలో కొత్త జంతువులు పాం'డాగ్'.. లయన్ 'డాగ్'

21-09-2024 03:16:47 PM

మీరు కొత్తగా జంతుప్రదర్శనశాల ప్రారంభించ దలచుకుంటే  చైనా నిపుణులను సంప్రదిస్తే సరి ఏ జంతువు కావాలన్నా సరే కుక్కలకు రంగులద్ది సమస్త జంతు ప్రపంచాన్ని మీ ముందు ఉంచేస్తారు. గతంలో ఒక కుక్క( అది కూడా  గ్రామ సింహమే కదా అనుకున్నారేమో..)కు రంగులద్ది బోను దగ్గర సింహం అని పేరు పెట్టారు.. తాజాగా పాండాను కూడా అలాగే చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు నకిలీ మాల్ కు పర్యాయ పదంగా చైనా మాల్, చైనా బజార్ తదితరాలను ఒక జోక్ లా చెబుతూ ఉంటాము.  

కానీ జూలో కుక్కలకు సైతం రంగులు వేసి పాండాలుగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టింగు లన్నీ వైరల్ కావడంతో నిజమేంటి అను పలు జీవకారణ్య సంఘాలు అన్వేషణలో పడ్డాయి. ఈ ఆరోపణలు నిజమేనని చైనా సైతం అంగీకరించింది. గత మేనెలలో తైఝౌ జూలోనూ ఇలాగే జరిగిందని కొందరు జంతుప్రదర్శన శాల సందర్శకులు తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారంతో తాము జూ సందర్శనకు వచ్చేలా చేశారని తమ నుంచి వసూలు చేసిన టికెట్ సొమ్ము  వాపస్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జూలో.. ఇలా.. మొదలైంది చైనాలోని ది షాన్ వెయ్ జూలో పాండాలను చూసేందుకు జనం ఇటీవల పోటెత్తారు. అరుదుగా కనిపించే ఈ జంతువులను తమ పిల్లలకు చూపించాలని తల్లిదండ్రులు జూకు క్యూకట్టారు. టికెట్ తీసుకుని లోపలకు అడుగుపెట్టిన సందర్శకులు బోనులో కనిపించిన పాండాలను చూసి నివ్వెరపోయారు. వాటి ప్రవర్తన కుక్కలను పోలి ఉండడంతో జాగ్రత్తగా పరిశీలించగా అవి నిజంగా శునకాలేనని బయటపడింది.

వాస్తవానికి జూలో పాండాలు లేవని, దీంతో పెంపుడు శునకాలకు రంగులు వేసి పాండాలుగా కనిపించేలా చేశారని గుర్తించారు. సదరు పాండాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు కాస్తా వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అవి పాం‘డాగ్’ లని కొందరు, పాండాల సరికొత్త వెర్షన్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. 

2013లో, హెనాన్ ప్రావిన్షియల్, జంతుప్రదర్శనశాల సింహానికి బదులుగా కుక్కను ఉంచిన విషయాన్ని నెటిజనులు గుర్తు చేస్తున్నారు. 2019లో, సైతం జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఒక జంతుప్రదర్శనశాలలో రక్కూన్ కుక్కను పెద్ద పాండాగా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి.