10-03-2025 06:15:16 PM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలు అమోఘం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జి కె ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 40 సంవత్సరాలుగా అల్ మదీనా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని చెప్పారు.
ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించాలని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్ సభ్యులకు సూచించడం జరిగిందని గుర్తుచేశారు. వెంటనే వారు కార్యాచరణ ప్రారంభించడంతో ఎఐసిటిఇ అధికారులు సైతం ఇన్స్పెక్షన్ పూర్తి చేశారని గుర్తుచేశారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, జికె ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల వల్ల ఎందరో పేద విద్యార్థులకు నాణ్యమైన టెక్నికల్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని రకాల అనుమతులను అధికారులను కలిసి చేయిస్తానని ఆయన స్పష్టం చేశారు. జీకే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు మైనారిటీ స్టేటస్ తెచ్చేందుకు సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ కు ఎన్నో మంచి విద్యాసంస్థలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శ్రీనివాస్ యాదవ్, ఇంతియాజ్ ఇసాక్, కాస్మిక్ అహ్మద్, సలీం తదితరులు పాల్గొన్నారు.