రెండో టీ20లో లంకపై విజయం
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. వర్షం అంతరాయంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ 7 వికెట్ల తేడాతో లంకపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుషాల్ పెరీరా (34 బంతుల్లో 53) టాప్ స్కోరర్. కమిందు మెండిస్ (26) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయి 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, పాండ్యా, అక్షర్‌లు తలా 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ ముందు 8 ఓవర్లలో 78 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు ) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నామమాత్రమైన మూడో టీ20 మంగళవారం జరగనుంది.