17-04-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల చేతిపంపుల మరమ్మతులను చేయించాలని అన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అర్హులైన వారి ఎంపికను ఇందిరమ్మ కమిటీతో కలిసి అధికారులు సమన్వయం చేయాలన్నారు.
మే నెల 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించాలన్నారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ మల్లేశం మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు, ఆవాసాలకు తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి చర్యలు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులు అడిగిన పలు సందేహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపివోలు, తదితరులు పాల్గొన్నారు.