calender_icon.png 29 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాపంగా మారిన కార్యదర్శి ఉద్యోగం!

26-03-2025 12:00:00 AM

పట్టుతప్పుతున్న పల్లెపాలన

 కార్యదర్శులకు భారంగా పంచాయతీ నిర్వహణ

 అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఉద్యోగులు

 గ్రామపాలన అధికారిగా మార్పుకు డిమాండ్

మెదక్, మార్చి 25(విజయక్రాంతి); గ్రామ స్థాయిలో ప్రతి శాఖ పనిని పంచాయతీ పాలకవర్గంతో సమన్వయ పర్చుకొని  ప్రతీ శాఖకు జవాబుదారీగా పనిచేస్తూ అన్ని శాఖల పనిని సమర్థవంతంగా నిర్వర్తించే అధికారి పంచాయతీ కార్యదర్శి..అలాగే గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్ధవంతంగా అందించడంలో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా ము ఖ్యం... అలాంటి పంచాయతీ కార్యదర్శులకు తాము పనిచేస్తున్న ఉద్యోగం శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమని సంతోషపడాలో..ఆ ఉద్యోగమే తమపాలిట శాపంగా మారిందని బాధపడాలో అర్థంగాని పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ డంతో కార్యదర్శుల మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని వాపోతున్నారు.

ప్రస్తుతం పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత 15 నెలలుగా ఎలాంటి నిధులు లేక ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువై అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో గ్రామ పంచాయతీల నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతుంది. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు నిర్వహణ భారాన్ని నెత్తినవేసుకొని అప్పులపాలవుతున్నట్లు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక పల్లెపాలన పట్టుతప్పుతుంటే తాజాగా ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్లు(జీపీఓ) నియామకం చేపట్టనుంది. దీం తో గ్రామస్థాయిలో గతంలో పనిచేసిన వీఆర్వో, వీఆర్‌ఏలకు ప్రస్తుతం నియామకం చేపడుతున్న గ్రామ పాలన ఆఫీసర్లుగా అవకాశం కల్పించనుంది. దీంతో అన్ని శాఖలతో మమేకమై విధులు నిర్వహించే కార్యదర్శుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. గ్రామపాలన అధికారిని నియమిస్తే తమను వారికి అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేలా కుట్ర జరుగుతుందని వాపోతున్నారు. 

గ్రామ అభివృద్ధి అధికారిగా పరిగణించాలి...

గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులను విలేజ్ డెవలప్మెంట్ అధికారిగా మార్పు చేయాలని కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పాలన అనగానే పంచాయతీ కార్యదర్శులే గుర్తుకు వస్తారని, తాజాగా ప్రభుత్వం నియమించే గ్రామ పాలన అధికారుల స్థానంలో వీఆర్వో లు, వీఆర్‌ఏలు వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను ఎగ్జిక్యూటివ్ అధికారి లేదా డెవలప్మెంట్ అధికారిగా పేరు మార్పు చేయడమో లేక గ్రామ పాలన అధికారిగా నియమించాలని పంచాయతీ కార్య దర్శులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రభుత్వం పరిశీలించాలి...

గ్రామాలలో ప్రజలతో, పాలకవర్గంతో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ విధులు నిర్వహించే కార్యదర్శులు అణచివేతకు గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ పాలన అధికారులుగా కార్యదర్శులను సైతం నియామకం చేయాలి. ఒకవేళ అది సాధ్యంకాని పక్షంలో గ్రామ అభివృద్ధి అధికారిగా లేదా ఎగ్జిక్యూటివ్ అధికారిగా మార్పు చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో న్యాయం చేయాలని, పంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి. పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యదర్శి స్థానంలో గ్రామపాలన అధికారిగా మార్పు చేయాలి.

-సందిల బలరాం, అధ్యక్షులు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం