పాలకుర్తి రామమూర్తి :
న దేవో విద్యతే కాష్ఠే,
న పాషాణే, న మృణ్మయే
భావే హి విద్యతే దేవస్తస్మాత్
భావోహి కారణం॥
- చాణక్య నీతి సూత్రాలు (8-12)
“దేవుడు కర్రలలోనో, మట్టిలోనో, విగ్రహాలలో నో ఉండడు. వ్యక్తి భావనలలో ఉంటాడు. ఆలోచనలలో రూపు దిద్దుకుంటాడు. ఉన్నది సత్యం ఒక్క టే. చూసే దృష్టియే మారుతుంది. “వ్యక్తి భావనయే అన్నింటికీ కారణం” అంటారు చాణక్య. సద్భావన, శ్రద్ధ, నియమాలతో పరిశ్రమించిన చోట, ఆ భావ నా పటిమను అనుసరించి దేవుడు ప్రకటితమవుతాడు.
కార్య స్వరూపం అనేది కార్యావిష్కరణలో ఉండదు. అది దార్శనికుడైన వ్యక్తి భావనలో ఉంటుంది. ఆలోచనలో ఆకృతిని పొందుతుంది. సాధించాల నే సంకల్పంలో బలోపేతమవుతుంది. విజ్ఞానంలో స్పష్టతను సంతరించుకుంటుంది. ప్రక్రియ ఆధారితంగా, భక్తిశ్రద్ధలతో దానిని ఆచరణలో పెట్టడం ద్వారా ఆవిష్కారమవుతుంది.
ఫలి తాలను సమాజంతో పంచుకోవడంతో సార్థకమవుతుంది. అందుకే, సంపద నీతోనే కాదు నీలోనే ఉంటుంది” అన్నది చాణక్యుల వారి వివరణ. కను క, లక్ష్యం అనేది లక్ష్యసాధనలో ఉండదు. దానిని సాధించే ప్రయత్నంలోనే ఉంటుందని మనం తెలుసుకోవాలి. కార్య సాధనా క్రమంలో పైకి కనిపించే అవకాశాలు పరిమితమైనవే.
అంతర్లీనంగా ఉందనిపిం చని అవకాశాలే ఎక్కువ. మంచుకొండ నీటిపైన కనిపించేది 15% మాత్రమే. 85% నీటి లోపలే ఉంటుంది. సంస్థ విజయాన్ని అది సముపార్జించి న సంపదతో కొలుస్తాం. కాని, సంపదకు అతీతమైన అంశాలెన్నో, సంపదను సార్థకం చేసుకోవ డంలో ముఖ్యభూమికను పోషిస్తాయి.
సంపద కనిపించే 15% శాతం అనుకుంటే, మిగిలిన అంశాలు 85% ఫలితాలకు కారణమవుతా యి. సంపద అంటే డబ్బు కాదు, ప్రజలకు అవసరమైన వస్తువులను, సేవలను అందించడం.
నాయకుని దార్శనికత
సంస్థ విజయం నాయకుని దార్శనికతపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన, ఉన్నతమైన స్వప్నాన్ని దర్శించగలగిన నాయకుడు సంబంధిత బృందంలోని సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలను అవగాహన చేసుకొంటాడు. వాటిని సంస్థ లక్ష్యాలకు అనుసంధానించగలిగిన నైపుణ్యాన్ని అతను కలిగి ఉండాలి.
బృందంలోని సభ్యులు నిర్వహించే పనులలో వారికి ఉన్న సాంకేతిక విజ్ఞానంపైనా, సాఫ్ట్ స్కిల్స్ పైనా సరైన అంచనాలు ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే తన అనుయాయుల ఆదాయ వ్యయాల పట్ల సరైన అవగాహన. వారికి, వారి కుటుంబసభ్యులతో ఉన్న అనుబంధాలు, జీవితం పట్ల వారికి ఉన్న సంతృప్తి, తోటివారితో పరస్పర సౌహార్ద్రతా భావనతో కూడిన సమన్వయత, దానిపట్ల అవగాహన ఉండాలి.
నిజానికి అవి యజమానికి-ఉద్యోగులకు మధ్య కుటుంబ సంబంధాలుగా కాకుండా సంస్థాగత బంధుత్వ ఫలితాలకు మధ్య వారధులుగా నిలవాలి. సంస్థలో అప్పటి వరకు పట్టించుకోని సూక్ష్మాంశాలను పరిశీలించడం ప్రయోజనకారి చేయవలసిన పని. ఉదా॥కు ఒక సంస్థ ఒక సంవత్సరంలో 329 కోట్ల లాభాలను ప్రకటించింది.
నిజానికి ఆ సంవత్సరం ఆ సంస్థ తుక్కును అమ్మడం ద్వారా 340 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఉపయోగంలో లేని, నిరర్థకమైన ఆస్తులను వదిలించుకోవడం ప్రయోజనకత్వం. సమర్థవంతమైన మానవ వనరుల వినియోగం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
పుస్తకాలలో నుంచి తొలగించుకున్నా, రాని బాకీల వసూళ్ళపై శ్రద్ధ పెట్టడమూ మంచిదే. ఆ ప్రయత్నం నాయకుని సమయాన్ని హరిస్తుందనుకుంటే ఆ బాధ్యతను మరొకరికి అప్పగించడం ఉత్తమం. అవసరమైన మేరకు అనుభవజ్ఞులతో మాట్లాడుతూ, వాంఛనీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ ప్రయత్నాలన్నీ నష్టాలతో ఉన్న సంస్థకే పరిమితం కావు. లాభాలలో ఉన్న సంస్థలుకూడా తమ సంపదను పెంచుకునేందుకు ఉప యుక్తమవుతాయి. ఓడిపోకుండా యుద్ధం చేయ డం కాదు, జయించే దిశలో యుద్ధం చేయాలి.
గడించిన ప్రతి పైసా మరొక సంస్థను ఏర్పాటు చేసేందుకో లేదా సంస్థను ఉన్నతీకరించుకునేందుకో ఉపయోగించడం ద్వారా మరెందరికో ఉపా ధిని చూపిన వారవుతారు. ఇదీ ఆచార్య చాణక్య పై సూత్రీకరణ (సంపద నీతోనే కాదు నీలోనే ఉంటుంది) లోని అంతరార్థం.