calender_icon.png 11 October, 2024 | 2:53 PM

ప్రాణుల జన్మ రహస్యం

11-10-2024 12:00:00 AM

దేహం ఉన్నంత కాలం సందేహం తప్పదు. జిజ్ఞాసికి, సమాధానం లభించే వరకు మనసు నిలకడ చెందదు. తత్త్వాన్వేషణలో సమర్థుడైన గురువు లభించి సంశయ నివృత్తి చేసే వరకు జిజ్ఞాసి తన ప్రయత్నాన్ని వదిలిపెట్టడు. అఖండ భారతావని నుంచీ ఆరుగురు జిజ్ఞాసువులు, పిప్పలాద మహర్షిని దర్శించి, తమను వేధిస్తున్న ఆరు ప్రశ్నలను ఆయన ముందుంచారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు మహర్షి అందించిన సమాధానాలు ‘ప్రశ్నోపనిషత్’గా మనకు తత్త్వచింతనా భూమికగా లభిస్తున్నది.

“ప్రతి వ్యక్తి మనసులో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఈ ప్రశ్నలు పరిప్రశ్నలే! సమాధానాలు నిస్సంశయంగా మహర్షి దర్శనాలే! ఈ ఆరు ప్రశ్నలలో మొదటిది, ‘ప్రాణుల పుట్టుక మూలాలు ఏవి?’ అన్నది. ప్రతిదీ సృష్టింబడేదే! ఏది సృష్టింపబడాలన్నా ‘శక్తి’ అవసరం. ఆ శక్తికే ‘కర్త’ అని పేరు.

అది నిజానికి శూన్యం. అంటే ఏమీ లేదని కాదు. అంతా నిండి ఉన్నదని అర్థం. దానికి ఆకాశమని పేరు. ఈ ఆకాశం నుంచే గాలి, నీరు, మన్ను వంటివి ఏర్పడుతున్నయ్. ఆ కారణంగా ఒక లోకం, దానిని అంటి ఉన్న ప్రాణం కలిసి విశ్వంగా కంటికి కనబడుతున్నది.

సమస్తమూ అగ్ని నుంచే పుడుతున్నది కనుక అగ్ని స్వరూపమైన సూర్యుడు, భూగోళాన్ని, ఖగోళాన్ని ప్రకాశమానం చేస్తున్నాడు. అంటే, కంటికి కనిపించేట్లు చేస్తు న్నాడు. కనుక ఆకాశం, శక్తి, అగ్ని, సూర్యుడు కలిసి ప్రాణమవుతున్నది. కనుకనే సూర్యుడే కాలాధిపతి, కర్మసాక్షి.

కాలం, యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా... విభజించుకొని ఆయా ఋతువులను అనుసరించి ప్రాణశక్తి ద్వారా ప్రాణికోటి సృష్టికి కారణమవుతున్నది. తరించటానికో, అంతరించటానికో జీవులు కాలాన్ని ఎంచుకుంటారు. ఒక మార్గం అతిసాధారణమైంది. రెండవది ఉన్నతమైంది. మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఉన్నత మార్గంలో జీవించటం పరమావధి కావాలి. ఆ మార్గం వ్యక్తికి, వ్యవస్థకు శ్రేయోదాయకం.

సలక్షణమైన గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి, వ్యక్తిగత, కుటుంబగత, సంఘగత, ప్రపంచగత, సృష్టిహిత, కార్యకలాపాలను నిరంతరం కొనసాగిస్తుండాలి. సృష్టిపట్ల తనకున్న ధర్మాన్ని పాటిస్తుండాలి. ఈ ధర్మం వల్లనే ఉత్పత్తి, పునరుత్పత్తి సాధ్యమై లోకం నిలబడుతుంది. ప్రాణుల మూలాలన్నీ ఈ మూలసూత్రంపై ఆధారపడి, శక్తివంతమవుతయ్.

వైదాంతిక భాషలో తపస్సు, స్వాధ్యాయం, బ్రహ్మచర్యం వంటి పదాలున్నా వాటి అర్థం, పరమార్థం ఒక్కటే! ప్రకృతిలో భాగంగా, వినయంగా, నియమబద్ధంగా జీవించటమే! అస్తిత్వాలకు మూలమైన ప్రాణశక్తిని వృధా చేయటం దోషం! ప్రాణశక్తిని వృద్ధి చేయాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఇందులో ఏమరుపాటు, అలసత్వం పనికి రాదు. తమస్సును వదలిపెట్టాలి. క్రమానుగతంగా అది తపస్సుగా రూపాంతరీకరణం చెందుతుంది.

ఈ సృష్టికి కారణమైన బ్రహ్మంలో అంటే శక్తిలో లక్ష్యం ఉంచి, మనసును ఉన్నత మనసుగా, శుద్ధ మనసుగా తీర్చిదిద్దుకోవాలి. అన్ని వేళలా అదే స్థాయిలో, అదే స్థితిలో మనసును నడిపించగలిగితే అది బ్రహ్మచర్యం! శక్తి శూన్యాల సంగమస్థితిని గుర్తెరిగి, వర్తించగలిగితే అది బ్రహ్మచర్యమే! బ్రహ్మచర్య ఫలాలను గృహస్థాశ్రమ నిర్వహణ ద్వారా అందుకోవాలి.

ధార్మిక జీవనం, సత్ప్రవర్తన, ఋజువర్తన, ఆత్మనిష్ఠ, సమాజహిత జీవనం, బ్రహ్మానుసంధానం వల్ల కలిగే ఆనందం, ఆ ఆనందం నుంచి లభించే తృప్తి, తృప్తి వల్ల కలిగే ముక్తి... ఇవన్నీ ఆరోగ్యవంతమైన ప్రాణికోటి సృష్టికి ఆధారమై ప్రపంచానికి సహజానందాన్ని, ప్రశాంతిని కలిగిస్తయ్.

దేహం అన్నగతం కనుక యుక్తాహారాన్ని స్వీకరించాలి. ఆహారం నుంచే ప్రాణం, రక్తం, మాంసం, ఎముక వంటివన్నీ పుడుతున్నయ్. పురుష దేహంలో అది రేతస్సుగా అంటే శుక్లంగా పుట్టి, సంతానోత్పత్తికి శక్తివంతమైన సాధనమై శోభిల్లుతున్నది.

ప్రాణుల పుట్టుక వెనుక ఇంతటి విజ్ఞాన భూమిక ఏర్పడి ఉన్నది. కనుక ఆహార, వ్యవహార, విహారాలను సమన్వయ రీతిలో అర్థం చేసుకోవాలి. సమస్త సృష్టికి మూలమైన అగ్నిని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకోవాలి. ప్రాణులన్నిటిలోను అగ్నియే శక్తిగా, ప్రాణంగా అనుభవంలోకి వస్తున్నది... ” ముగించారు మహర్షి! జిజ్ఞాసువుల మనసు రెండవ ప్రశ్నకు తాము పొందబోయే సమాధానం కోసం ఎదురు చూస్తున్నది...

- వి.యస్.ఆర్.మూర్తి