ఒక సంస్థలో నాయకుడు ఎలా ఉండకూడదో చాణక్యుని అర్థశాస్త్రంలో ‘షాడ్గుణ్యం’ అనే ఏడవ అధికరణంలోని ఐదవ ఆధ్యాయంలో వివరించడం జరిగింది. ఒక రాజ్యం చిరకాలం సుస్థిరంగా ఉండాలన్నా, ఒక సంస్థ అభ్యుదయ పథంలో నడవాలన్నా దానిని నడిపించే నాయకుడు ఉదాత్త వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి. తన అనుచరులలో అసంతృప్తి పొడసూపకూడదు. అలా ఎప్పుడైనా కనిపించినా దానిని వెంటనే సరిచేయాలి. అలాంటి నాయకునిలో ఏయే లక్షణాలు ఉండకూడదో చెప్పాడు చాణక్యుడు.
నాయకుడు తన వద్ద వుండే ఉద్యోగుల సలహా, సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటాడు. వారి తప్పుడు సలహాలు నాయకుని నిర్ణయాన్ని నకారాత్మకంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి, అనుయాయులను ఎప్పుడూ సంతృప్తిగా ఉంచే ప్రయత్నం చేయాలి. మంచివారిని దూరంగా పెట్టినా, చెడ్డవారిని దగ్గరకు తీసినా నాయకుని నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. హింసా మార్గంలో నడుస్తున్న వారు తనకు ఇష్టమైన వారైనా, అధర్మమైన సూచనలు, సలహాలు ఇస్తున్నా వారిని దూరం పెట్టకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది.
విలువలతో కూడిన, ధర్మ సమ్మతమైన ఆచారాలను లేదా రాజ్య/సంస్థ సంస్కృతికి భిన్నంగా ప్రజా వ్యతిరేకమైన చట్టాలను, మార్గదర్శకాలను నిరంకుశంగా అమలు చేయడం వల్ల ప్రజల తిరస్కారానికి నాయకులు గురవుతారు. చేయవలసిన పనులను వాయిదా వేయడం, చేయకూడని పనులను వెంటనే చేయడం వల్ల విపరీత పరిణామాలు సంభవిస్తాయి.
అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి
అని పెద్దలు అన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన వేతనాలను సకాలంలో ఇవ్వక పోవడం, అన్యాయంగా ప్రజలపై వేసిన పన్నులను బలవంతంగా వసూలు చేయడం వల్ల అసంతృప్తికి లోనయిన ప్రజలు/ఉద్యోగులు అవకాశం వస్తే శత్రువులకు సహకరిస్తారు. చిన్నచిన్న తప్పులకు పెద్ద దండనలు విధించడం, తన వారైతే పెద్ద తప్పులనూ వదిలేయడం వల్ల ప్రజలు/ఉద్యోగులు శత్రుపక్షం వైపు చేరుతారు. అంటే, సంస్థను వదిలివేసి తన పోటీ సంస్థలో చేరి తన ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తారు. అలవాటుగా తప్పులు చేస్తున్న వారిని శిక్షించడం అవసరమే. ఈ ప్రక్రియలో అనూచానంగా వస్తున్న ప్రక్రియను అనుసరించాలే కాని కొత్తకొత్త శిక్షలకు శ్రీకారం చుట్టవద్దు.
శత్రువులకు ఆయుధాలు ఇవ్వరాదు
సోమరితనం నాయకులకు బద్ధ శత్రువు. దానివల్ల నాయకుడు యోగక్షేమాలకు దూరమవుతాడు. ‘యోగం’ అంటే పొందదగింది. ‘క్షేమం’ అంటే యోగాన్ని నిరంతరం కాపాడుకోవడం. సంస్థ ప్రగతి యోగం. దాని నిలకడ క్షేమం. బృందంలోని సభ్యులలో అసంతృప్తిని జనించనీయవద్దు. ఏ కారణం వల్లనైనా రెండు బృందాల మధ్య వైరుధ్యం ఏర్పడితే వారిని పిలిచి విడివిడిగానూ, ఉమ్మడిగానూ విచారించాలి. ఇది వారివారి భావోద్వేగాలకు సంబంధించింది కాబట్టి, వారు చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలే కాని నిర్ణయం తీసుకునేందుకు తొందర పడవద్దు. ఇరువురూ సంస్థకు ముఖ్యులయితే సత్యమేదో వారి పరోక్షంలో తెలుసుకోవాలి. అవసరమైతే ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి సలహాలు తీసుకోవాలి. నిర్ణయాన్ని మాత్రం భావోద్వేగాలకు దూరంగా వెల్లడించాలి.
ఈ ప్రక్రియలో ఆ నిర్ణయం వెనుక వున్న కారణాలను తెలియచేయాలి. అయితే, ఇందులో జరిగిన తప్పును ఏవగించుకోవడం, ఆ తప్పు మరొకమారు జరగకుండా చర్యలు తీసుకోవడం అవసరం. అంతేకాని, తప్పుకు బాధ్యులు అంటూ నచ్చని వారిని శిక్షించడం వల్ల వారి రూపంలో శత్రువులకు ఆయుధం ఇచ్చిన వారవుతారు. ఒకరికి శత్రువులు ఎక్కువగా ఉండి, కష్టాలలో ఉంటే అతడిని ‘యాతవ్యుడు’ అంటారు. అలాగే, తనంటే గిట్టని వారిని ‘అమిత్రులు’ అంటారు. ఈ ఇరువురిలో ముందుగా అమిత్రుడిని అణచివేయాలి అనేది చాణక్యనీతి. ఎందుకూ అంటే, అమిత్రుని అణిచి వేసేందుకు అవసరమైతే యాతవ్యుడు సహాయపడతాడు. కాని, యాతవ్యుని అణచి వేయడానికి అమిత్రుడు సహాయపడడు.
ఒక నాయకుడు బాధ్యతా నిర్వహణలో తన పరిధిని దాటిన మార్పులను అంగీకరించే స్థైర్యాన్ని సాధించాలి. ఏయే మార్పులను తాను చేయగలడో వాటిని అమలు పరచగలిగే ధైర్యాన్ని పొందేందుకు సన్నద్ధుడై ఉండాలి. అలాగే, ఈ రెంటి మధ్య భేదాన్ని గుర్తించగలిగే విజ్ఞతను పొందాలి. ఇలాంటి వివేచన పొందని నాయకుడు అపజయాన్ని పొందుతాడు.