calender_icon.png 8 October, 2024 | 11:53 PM

రెండో షెడ్యూల్ షురూ

04-10-2024 12:18:12 AM

‘సలార్’, ‘కల్కి2898ఏడీ’లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో ప్రభాస్. అదే ఊపులో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్’ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇటీవలే ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో మరో చిత్రం పట్టాలెక్కడమే కాదు, తొలి షెడ్యూల్ సైతం పూర్తి చేసుకుందీ సినిమా.

‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇక రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఇందుకోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్‌లోనూ ప్రభాస్ పాల్గొనే అవకాశం లేదనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు హనురాఘవపూడి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఏదేమైనా సమయం వృథా కాకుండా దర్శకుడు హను రాఘవపూడి షూటింగ్ ప్లాన్ చేస్తుండటంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న హను రాఘవపూడితో ప్రభాస్ మూవీ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ను సోల్జర్ పాత్రలో హను చూపించబోతున్నారు.

డిసెంబర్ నుంచి ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్ వచ్చిన కొన్ని నెలలకే ఫౌజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు పాటలను రెడీ చేశారని, త్వరలోనే వాటికి సంబంధించిన అప్డేట్‌ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.