calender_icon.png 17 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపులో కనిపించని రెండో మైండ్!

17-11-2024 01:42:46 AM

గట్స్ బాగుండాలి గురూ..

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు మన ఆరోగ్యం మన పేగుల్లో ఉందని అంటున్నారు డాక్టర్లు. పేగులు అనగానే.. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయనే విషయం తెలిసిందే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంతోపాటు వ్యర్థాలను బయటకు పంపిస్తాయని కూడా తెలుసు. కానీ పేగు(గట్)కు, మెదడుకు అనుబంధం ఉందంటే నమ్ముతారా? బ్రెయిన్‌కు మించి ఓ సూపర్ కంప్యూటర్‌లా గట్ పనిచేస్తుందనే విషయం మీకు తెలుసా? ఒక్కసారి పేగు పనితీరు తెలుసుకుంటే ఇన్ని లాభాలున్నాయా ఆశ్చర్యపోవడం ఖాయం. 

పేగు మన శరీరంలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ఇది మెదడుకు ఏమాత్రం తీసిపోదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇటీవల శాస్త్రీయ పరిశోధనలు పేగుకు సంబం ధించిన ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. మొత్తం శరీర వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ, మెదడుకు అనుసంధానమై ముఖ్య అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

మానసికస్థితి మొదలుకొని.. రోగనిరోధక వ్యవస్థ పనితీరు వరకు.. అనేక వ్యవస్థలపై ప్రభావితం చూపిస్తున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. పేగు.. మెదడుకు మధ్య అనుబంధంగా పనిచేస్తూ శారీరకంగానే కాదు..

జీవరసాయనాల పరంగానూ ప్రభావం చూపుతుంది. ఏదైనా ఆందోళన కలిగిస్తే భయం మొదలుకావడం, ఒత్తిడితో చిత్తుకావడం లాంటి మార్పులు మన శరీరంలో చోటుచేసుకుం టాయి. అలాగే ఇష్టమైన భోజనం, స్వీట్లు తిన్నప్పుడు ఆనందం కలగటం సహజం.

ఇవన్నీ మెదడు, పేగుల మధ్య సంబంధానికి చిహ్నాలే. వీటి మధ్య లక్షలాది నాడు లు, నాడీ కణాలు అటూఇటూ సమాచారాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాయి. పేగుల్లో పుట్టుకొచ్చే నాడీ సమాచార వాహికలు (న్యూరోట్రాన్స్మిటర్స్), ఇతర రసాయనాలు మెదడును కూడా ప్రభావితం చేస్తాయి.

ఒకవైపు పేగులు ఆరోగ్యంగా ఉండటానికి మెదడు తోడ్పడుతుంటే.. మరోవైపు మెదడు సరైన సంకేతాలిచ్చేందుకు పేగులు యంత్రంలా పనిచేస్తాయి. అంటే ఒకటి అనారోగ్యానికి గురైతే.. మరోకటి ప్రభావితం అవుతుందన్నమాట. పేగు, మెదడు అనేక ఇతర విషయాలు లింకై ఉన్నాయి. జీర్ణవ్యవస్థ కార్యకలాపాలు, మన ఆలోచనా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేయగలవని డాక్టర్లు చెబుతున్నారు.

శరీర వ్యవస్థలపై..

మన రోగనిరోధక వ్యవస్థ దాదాపు 70 శాతం పేగులతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే జీవులకు ప్రతిస్పందించడానికి బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. అనేక రకాల వ్యాధులతో పోరాడేందుకు సహాయంగా ఉంటుంది. ఒత్తిడి, పేగు ఆరోగ్యం దగ్గరి సంబంధం ఉండటం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి జీర్ణక్రియ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఉబ్బరం, అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ జీర్ణ సమస్యలు క్రమంగా ఒత్తిడి స్థాయిలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇది ఒక విష వలయాన్ని సృష్టిస్తుంది. ఈ పరస్పర చర్యలో గట్-, మెదడు కీలకం.

వీటికి దూరంగా ఉండండి

* ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడానికి సులువుగా, రుచికరంగా ఉన్నప్పటికీ, వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మన గట్లోని మైక్రోబయోటా సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. జీర్ణ రుగ్మతలు,  మంటను కలిగిస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకెట్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండండి.

* షుగర్ ఐటమ్స్ పేగుపై అధిక ప్రభావం చూపుతాయి. కాబట్టి స్వీట్లు, సోడా డ్రింక్స్, బేకరీ ఉత్పత్తులు మొదలైన వాటిని తక్కువగా తీసుకోండి.

* వేయించిన ఆహారాలు చాలా రుచికరమైనవి అయినప్పటికీ, అవి మన గట్ బ్యాక్టీ రియాను ప్రభావితం చేసే అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వేయించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో మం ట వస్తుంది. ఇది చివరికి జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

గట్ పనితీరు దెబ్బతింటే..

మెంటల్ హెల్త్: గట్ పనితీరు సరిగ్గా లేకపోతే మెంటల్ హెల్త్‌కు దారితీస్తుంది. దాంతో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా బైపోలార్ డిజార్డర్ (మానసిక స్థితి)కు కారణమవుతుంది. దీంతో ఏకాగ్రత లోపించి రోజువారీ పనులను తీవ్ర ఇబ్బందులు కలిగేలా చేస్తుంది.

ఇక బైపోలార్ డిజార్డర్ మొత్తం కుటుంబాన్ని సైతం ప్రభావితం చేయగలదు. కాబట్టి సకాలంలో గుర్తించి మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. క్రమ తప్పకుండా జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తూ చురుగ్గా ఉండొచ్చు.

న్యూరోలాజికల్ డిజార్డర్: నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పార్కిన్సన్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. ఆటిజం బారిన పడేలా కూడా చేస్తుంది. అయితే వీటికి చెక్ పెట్టాలంటే జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు శారీరక వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, మంచి నిద్రపోవడం లాంటివి చేయడం అవసరం. 

ఆటో ఇమ్యూన్ డిసీజ్: రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ఇది శరీరంలోని కణజాలంపై దాడి చేసి దెబ్బతీస్తుంది. అయితే ఈ వ్యాధులకు ఎటువంటి నివారణలు లేనప్పటికీ, కొన్ని రకాల చికిత్సలున్నాయి. కార్టికోస్టెరాయిడ్స్ ఔషధాలతో చికిత్స చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థకు చెక్ పెడుతుంది. 

మెటబాలిక్ డిజార్డర్: శరీరంలోని రసాయన చర్యలకు అంతరాయం ఏర్పడినప్పుడు జీవక్రియ రుగ్మత సమస్యలు దాడి చేస్తాయి. అధిక రక్తపోటు, రక్తంలో గ్లూకోజు పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం.. ఇవన్నీ జీవక్రియ రుగ్మత అంశాలే. చాలామంది పెద్దగా పట్టించుకోరు.

కానీ ఇది మధుమేహం, గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరిగేలా చేస్తుంది. వయసు మీద పడటం, జన్యువుల వంటివీ ఇందుకు కారణమవుతుంటాయి. దీనిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

 ఫీచర్స్ డెస్క్

పేగు, మెదడు ఆరోగ్యం కోసం

* పేగు బ్యాక్టీరియాను మార్చుకోగలిగితే మెద డు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. ఇందుకు మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్ బాగా మేలు చేస్తాయి. పేగు బ్యాక్టీరి యా పులియబెట్టే పీచు పదార్థాలు (ప్రిబయాటిక్స్) కూడా మంచివే. కాబట్టి ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే పేగు-మెద డు అనుబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు. 

* చేపలు, గింజపప్పుల్లో దండిగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. మెదడు సమస్యల ముప్పు తగ్గటానికి దోహదం చేస్తాయి.

* పెరుగు, మజ్జిగ వంటి వాటిల్లోని మేలు చేసే బ్యాక్టీరియా మెదడు పనితీరు మెరుగు పడటంలో సాయం చేస్తుంది.

* చిప్స్ వంటి ఆహార ఉత్పత్తులు, తీపి పదార్థాలు తగ్గించుకోవాలి.

* నెమ్మదిగా, ప్రశాంతంగా రుచిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ భోజనం చేయాలి.

* శరీరానికి పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

* తగినంత నీరు తాగాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం, యోగా, ప్రాణాయా మం వంటి పద్ధతులతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడి, కుంగుబాటు మూలంగా పేగు బ్యాక్టీరియా రకాలు మారిపోయే ప్రమాదముంది.

బ్రెయిన్‌ను యాక్టివేట్ చేస్తుంది

మన శరీరంలో ఎన్ని కణాలుంటాయో.. మన పేగులోనూ అన్నిరకాల బ్యాక్టీరియాలుంటాయి. అవన్నీ శరీరాన్ని కాపాడుతాయి. శరీరంలోకి ఇతర చెడు బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు అప్రమత్తం అయి అరికడుతాయి. ఇతర వ్యర్థాలను కూడా నిరోధించి బయటకు పంపిస్తాయి. ముఖ్యంగా బ్రెయిన్ యాక్టివేషన్‌కు బాగా పనిచేస్తుంది. అలాగే లివర్, కిడ్నీ సంబంధించిన పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ గట్ బ్యాక్టీరియా మంచిగా పనిచేసేలా చూసుకోవాలి. అందుకోసం మంచి ఆహార అలవాట్లు పెంపొందించుకోవాలి. పేగుల పనితీరు బాగా లేకుంటే విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం ఇతర సమస్యలు దాడిచేస్తాయి. 

- డాక్టర్ వేణు భార్గవ

సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హైదరాబాద్