08-03-2025 11:52:09 PM
నాసాతో కలిసి టెక్సాస్ సంస్థ చేపట్టిన రెండో ప్రయోగమూ విఫలం..
జాబిల్లిపై విజయవంతంగా దిగలేకపోయిన ప్రైవేట్ ల్యాండర్..
వాషింగ్టన్: నాసా సహకారంతో టెక్సాస్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మెషిన్స్ అభివృద్ధి చేసిన అథేనా లూనార్ ల్యాండర్ కథ ముగిసింది. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా గత వారం ప్రయోగించిన ఈ ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద నిర్దేశించుకున్న ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయింది. ఎంచుకున్న ప్రాంతానికి 250 మీటర్ల దూరంలో గల భారీ లోయలో దిగి, పక్కకు ఒరిగిపోయింది. ల్యాండర్‌లోని బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడంతో అది పని చేయకుండాపోయింది.
చార్జింగ్ అయిపోవడానికి ముందు లోయలో తన పొజిషన్‌కు సంబంధించిన ఫొటోలను ల్యాండర్ భూమిపైకి పంపింది. లోయలో ల్యాండర్ ఉన్న పరిస్థితిని బట్టి, దానిలోని బ్యాటరీ తిరిగి రీచార్జ్ కావడం కష్టమని ఇంట్యూటివ్ మెషిన్స్ సంస్థ పేర్కొంది. దీంతో ల్యాండర్ ఇక పని చేయడం అసంభవమని స్పష్టం చేసింది. పని చేయకుండా పోయిన అథేనా లూనార్ ల్యాండర్‌లో నాసాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పేలోడ్లు ఉన్నాయి. ఇంట్యూటివ్ మెషిన్స్ గతంలో పంపిన ల్యాండర్ కూడా విజయవంతంగా జాబిల్లిపై దిగలేకపోయింది.