28-02-2025 12:24:17 AM
వనదుర్గకు జన హారతి... ఘనంగా బండ్ల ఊరేగింపు..
పాపన్నపేట, ఫిబ్రవరి 27: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో నిర్వహిస్తున్న జాతరలో రెండవ రోజు గురువారం నాడు ఏడుపాయల ప్రాంతం మొత్తం అమ్మ నామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం రోజున మొదలై మూడు రోజులు ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. జాతర మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులు రావడంతో వనమంతా జనంతో నిండిపోయింది.
క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, బోనమెత్తి నృత్యాలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్ల నృత్యాల కోలాహలంతో భక్తులు పులకించిపోయారు. భక్తులు అనేక సంఖ్యలో మేకలు, కోళ్లు కోసి విందులు చేసుకున్నారు. శివరాత్రి రోజు భక్తుల సంఖ్య తక్కువగా కనిపించినా గురువారం లక్షలాదిగా తరలివచ్చారు.
ఘనంగా బండ్ల ఊరేగింపు...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమయ్యే ఏడుపాయల వన దుర్గ భవాని జాతరలో రెండవ రోజు వన దుర్గ భవాని మాతకు బండ్ల ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గురువారం రోజు సాయంత్రం వన దుర్గ భవానికి ఘనంగా బండ్ల ఊరేగింపును నిర్వహించారు. ఈ బండ్ల ఊరేగింపు చూసేందుకు గాను వివిధ ప్రాంతాల నుండి అనేకమంది భక్తులుతరలివచారు.