calender_icon.png 10 October, 2024 | 12:57 AM

రెండో రోజు ఇంటికే పరిమితం

09-10-2024 02:14:21 AM

అసంపూర్తిగా ముగిసిన సీఎం ఢిల్లీ టూర్ 

హర్యానా, కశ్మీర్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ 

పార్టీ పెద్దలను కలవకుండానే హైదరాబాద్‌కు రాక 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అసంపూర్తిగా ముగిసింది. హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా రావడంతో సీఎం మంగళవారం ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి నిరాశకు గురై.. పార్టీ పెద్దలను కలవకుండానే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.

వామపక్ష తీవ్రవాద రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. రెండో రోజు పార్టీ పెద్దలతో భేటీ కావాలని ముందే నిర్ణయించు కున్నారు. అయితే, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు  అనుకూలంగా వస్తే అక్కడే సెలబ్రేట్ చేయాలని భావించారు.

ఆ తర్వాత ఢిల్లీ పెద్దలతో కలిసి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు పంపకంపైనా చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో ఇవేమీ చర్చించకుండానే రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. 

సీఎంతో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ భేటీ 

సీఎం రేవంత్‌రెడ్డితో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ భేటీ అయినట్టు తెలిసింది. నాంపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్, ఎంఐఎం నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వివాదం నడుస్తోంది. దీంతో వారిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నామని, అయినా కాంగ్రెస్ నాయకులు తమపై విమర్శలు చేయడంపై అసదుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.