calender_icon.png 24 October, 2024 | 2:59 PM

సత్యాన్వేషణ

12-07-2024 01:00:00 AM

వీఎస్‌ఆర్ మూర్తి :

అధ్యాత్మ శాస్త్రం వేద వేదాంతాల సారాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరిస్తుంది. భౌతికవాదాన్ని వదలకుండా ఆధ్యాత్మిక వాదాన్ని ఒక ఆచరణీయ వేదాంత భూమికగా మనిషి తన మనుగడను పూర్ణత్వం వైపు నడిపించాలి. సంఘ జీవనాన్ని ధర్మమార్గం వైపు మళ్ళించి మానవతా విలువలను పాటించాలి. 

ఆత్మవిద్యే అసలు విద్య. కవిత్వం, పాండిత్యం వంటివి మన భావనాశక్తికి అనుకూలించే అభివ్యక్తి సాధనాలు. సంస్కృతీ పురోగమనానికి, సంస్కార స్వరూపానికి, పాండిత్య స్పర్శ, కవితా ధోరణి దోహదపడతాయి. ఆత్మవిద్య, అనుభవం నుండీ పొందవలసింది అచ్చతెలివి. ఎన్నో వదులుకుంటేగాని కావలసిన దానిని పొందలేం. లోకవిద్యలను దాటి, మనసును హృదయంతో కలుపుకునే ప్రయత్నంలోంచి ఆత్మవిద్యా గంధం అనుభవమవుతుంది.

సత్యాన్వేషణ దిశగా, లక్ష్యంగా మన జీవితం సాగాలి. పుట్టింది మొదలుగా మరణం వరకు జరిగే జీవన ప్రయాణమంతా అనుభవమయమే. ఒక్కొక్క అనుభవం నుండి మానవతా వాదం బలపడుతుండాలి. అహాన్ని, తీవ్ర మమకారాలను, పిడివాదాలను, తర్కవితర్కాలను విదిల్చుకుని, వదల్చుకుని సహజీవన సౌందర్యాన్ని అలుపెరగక అనుభవిస్తూ, జీవితాన్ని అధివాస్తవికంగా పండుగ వలే జీవించాలి.

ప్రతి ఆలోచనను మానవీయం చేయాలి. అధ్యాత్మ, మరణానంతర సుఖం కోసం కాదు. ఉన్నదంతా ఇక్కడే ఉంది. చేయవలసినదంతా ఇక్కడే ఉన్నది. పరస్పర విరుద్ధ భావజాలాలతో, భిన్న వాదాలతో నిరంతరం సాగే ప్రపంచ పోకడలను గమనిస్తూ అధ్యయనంతో, సహనంతో, సమన్వయంతో జీవితాన్ని ప్రసన్న, ప్రశాంత ప్రవాహంగా పారించగల శక్తిని అధ్యాత్మ విద్య అలవోకగా అనుగ్రహిస్తుంది.

మనం పూర్ణమానవత్వాన్ని సాధించుకోవాలి. అపరిమిత, స్వార్థరహిత ఆలోచనా పరిధి నిజానికి ఒక విశాల వేదిక. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి... ఈ క్రమాన్ని ‘కేనోపనిషత్’ ధృడంగా పరిచయం చేస్తుంది.

అన్ని శబ్దాలు నిశ్శబ్దంలో నుంచే పుడతాయి.

అన్ని యుగాలు యోగంతోనే ప్రారంభమవుతాయి.

అన్ని జన్మల అనంతరం లభించేదే మానవజన్మ.

అది ముగిసేవరకూ సత్యాన్వేషణ తప్పదు. మానవ జీవిత పరమార్థం సత్యాన్వేషణే! మనిషి ఎంతో ధన్యుడు. ఆలోచించగల బుద్ధి, మనసు, స్పందించగల హృదయం, వివేకం, విచక్షణ, స్పృహ మనిషి సాధించుకున్న వికాస స్థితులు. అయితే, వీటన్నింటినీ సమన్వయంతో నిగ్రహించుకుంటూ వినియోగించుకోవాలి. ప్రకృతితో మమేకమై, అందులో తానొక భాగమై, ప్రకృతి గమనానికి తన తోడ్పాటును అందించాలి. ఇదే అసలైన అధ్యాత్మ శిక్షణ.

శ్రద్ధ, తద్వారా పొందే జ్ఞానం అధ్యాత్మ శక్తిని తేజోమయం చేస్తుంది. అనుకూలతలను అనుగ్రహిస్తుంది. పశుత్వాన్ని, శఠత్వాన్ని వదిలి పావన భావనామయ ప్రపంచాన్ని అంతరంగంలో సృష్టిస్తుంది. మనిషి మనసు విశ్వ హృదయంతో అనుసంధానమై, లోపలి వెలుగు సన్మార్గం వైపు, అమృతత్వం వైపు సరళ గంభీరంగా నడిపిస్తుంది.

ఆత్మవిద్యే అధ్యాత్మ శాస్త్రం. అది అన్నిటిలోవున్న శక్తిని భేదభావం లేకుండా అనుభవ పరిధిలోకి తీసుకొస్తుంది. స్తబ్దమైన మనసు చైతన్యవంతమై మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. మనిషి, తనలోని మాయావిని నిరంతరం జయిస్తూ ఉండాలి. మహాయోగిని నిలబెట్టుకుంటుండాలి. ఆశలు ఆశయాలై ఆదర్శ సీమలో, మనిషి మానవతా వాదాన్ని ఆశ్రయించాలి.

నేను, నాది అన్న సంకుచిత పరిధి నుండి బయటపడి మనిషి మనం, మనది అన్న సమతా భావాన్ని ధృడతరం చేసుకోవాలి. ఈ క్రమంలో మనిషి అమరత్వ లబ్ధిని, ఆనంద సిద్ధిని తాను బతికుండగానే పొందగల అనుభవాన్ని అధ్యాత్మ శాస్త్రం అనుగ్రహిస్తుంది. అధ్యాత్మ శాస్త్రం వేద వేదాంతాల సారాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరిస్తుంది. భౌతికవాదాన్ని వదలకుండా ఆధ్యాత్మిక వాదాన్ని ఒక ఆచరణీయ వేదాంత భూమికగా మనిషి తన మనుగడను పూర్ణత్వం వైపు నడిపించాలి. సంఘ జీవనాన్ని ధర్మమార్గం వైపు మళ్ళించి మానవతా విలువలను పాటించాలి. భారతీయమైన తత్వశాస్త్రమంతా మానవతా వాదానికి పెద్ద పీట వేసింది. ఈ జాతి శక్తంతా అధ్యాత్మలోనే ఇమిడి ఉన్నది. కేనోపనిషత్ ఆలోచనాత్మకం!