calender_icon.png 6 October, 2024 | 1:46 PM

ఆరు వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు పూర్తి

05-10-2024 01:19:14 AM

నాలుగు వాయిదా

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పది యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. వీసీల ఎంపిక కోసం జరగాల్సిన సెర్చ్ కమిటీల సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికి మొత్తం నాలుగు యూనివర్సిటీల సెర్చ్ కమిటీలు వాయిదాపడ్డాయి.

శుక్రవారం జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీలు సమావేశం కావాల్సి ఉండగా, తెలంగాణ, కాకతీయ వర్సిటీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

గురువారం పాలమూరు, తెలుగు, ఓయూ, అంబేద్కర్ వర్సిటీ సమావేశాలు జరగాల్సి ఉండగా అంబేద్కర్ వర్సిటీ సమావేశం వాయిదా పడింది. అంతకుముందే ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సమావేశం వాయిదా పడింది. నామినీలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికి మొత్తం ఆరు వర్సిటీల కమిటీల సమావేశాలు మాత్రమే పూర్తయ్యాయి.

ఈనెల 1న మహాత్మాగాంధీ, 2న ఉస్మానియా, తెలుగు వర్సిటీ, పాలమూరు వర్సిటీలు, శుక్రవారం జేఎన్టీయూ, శాతవాహన వర్సిటీల సమావేశాలు పూర్తయ్యాయి. తెలంగాణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఫైన్‌ఆర్ట్స్, కాకతీయ వర్సిటీ కమిటీలు ఇంకా సమావేశం కావాల్సిఉంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేసే పనిలో అధికారులున్నారు.