05-04-2025 12:11:52 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రైలు బండి వస్తేనే ఆ ప్రాంతంలో సర్కారు బడులు తెరిచే పరిస్థితి నెలకొంది. రైలు ఏమాత్రం ఆలస్యం అయినా ఆ రోజు విద్యార్థులు బడి గేటు బయటనో లేదా వరండాల్లోనే కూర్చొని ఉపాధ్యాయుల కోసం ఎదురు చూడాల్సిందే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిత్యం కనిపించే దృశ్యాలు ఇవి.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో అత్యధికులు నిత్యం వరంగల్, మహబూబాబాద్ నుంచి కేసముద్రంకు రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి ప్రైవేటు వాహనాల్లో పాఠశాలలకు వస్తుండగా, మరికొందరు వరంగల్ నుంచి ఉదయం పుష్పుల్, మహబూబాబాద్ నుంచి సింగరేణి రైళ్ల ద్వారా వస్తున్నారు.
ఫలితంగా పాఠశాలల సమయపాలన ప్రకారం తెరవకుండా ఆయా రైలు బండ్లు ఎప్పుడు వస్తే అప్పుడే పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి దాపురించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ల స్థానికంగా ఉండాలన్న నిబంధనలకు నీళ్లు వదులుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కపూట బడితో మరింత ఇక్కట్లు
వేసవి నేపథ్యంలో ఒక్క పూట బడులు నిర్వహిస్తుండగా, పాఠశాలల్లో ఉదయం 7.45కు మొదటి గంట, 7.55 కు రెండో గంట మోగించి ప్రార్ధన పూర్తి చేసిన తర్వాత 8 గంటలకు విద్యా బోధన ప్రారంభించాలి. అయితే వరంగల్ వైపు నుంచి కేసముద్రంకు పుష్పుల్ ప్యాసింజర్, మహబూబాబాద్ నుంచి సింగరేణి రైలు ఉదయం 8 గంటల లోపు కేసముద్రం చేరుకోకపోవడంతో ఉపాధ్యాయులు కేసముద్రంలో దిగిన తర్వాత తాము విధులు నిర్వహిస్తున్న పాఠశాలకు వెళ్లడానికి మరో అరగంట ఆలస్యం అవుతుంది.
దీంతో పాఠశాలల్లో సమయపాలన గాడి తప్పింది. రైలు బండి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్న తర్వాతే పాఠశాలల నిర్వహణ సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు పూటల బడులు నిర్వహించిన సమయంలోనూ ఇదే తరహా కొనసాగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గురువారం రాజీవ్నగర్ పాఠశాల ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు చేరుకోకపోవడంతో విద్యార్థులు ఆరుబయట నిరీక్షిస్తున్న ఘటనను తల్లిదండ్రులు ఫొటోలు తీసి అధికారు లకు పోస్ట్ చేశారు. దీంతో మండల విద్యాశాఖాధికారి విచారణ జరిపి ఇద్దరు ఉపాధ్యా యులకు మెమోలు జారీచేశారు.
అయితే ఈ ఒక్క పాఠశాలే కాకుండా మండలంలోని అనేక పాఠశాలల్లోనూ ఇదే తంతు సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. విధులు నిర్వహించే చోటనివాసం ఉండకుండా దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదం డ్రులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.