calender_icon.png 22 December, 2024 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదే రచ్చ

14-09-2024 12:59:49 AM

  1. అరికెపూడి ఇంటికి వెళ్లబోయిన కౌశిక్‌రెడ్డి 
  2. అడ్డుకొన్న పోలీసులు
  3. రాష్ట్రమంతా బీఆర్‌ఎస్ నేతల హౌజ్ అరెస్టులు
  4. గాంధీ నివాసం వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
  5. వారికోసం ఇంట్లో కూర్చీలు వేసిన అరికెపూడి 
  6. తెలంగాణ నీ అయ్య జాగీరా?: అరికెపూడి గాంధీ 
  7. సీఎం ఆదేశాలతోనే నన్ను చంపే కుట్ర: కౌశిక్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి)/కూకట్‌పల్లి: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య శుక్రవారం కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. దీంతో హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు కూడా పొలిటికల్ హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్. బీఆర్‌ఎస్ నేతల పోటాపోటీ కార్యక్రమాలు, నిరసనలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

తన ఇంటిపై గురువారం దాడి చేసినందుకు నిరసనగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ నివాసాన్ని ముట్టడిస్తానని ప్రకటించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. అందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు ముందస్తుగానే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను వారి ఇండ్ల లోనే నిర్బంధించారు. అనంతరం పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహించిన కౌశిక్, అరికెపూడి.. పరస్పరం విమర్శలు గుప్పించుకొన్నారు. తెలంగాణ నీ అయ్య జాగీరా? అని అరికెపూడి ప్రశ్నించగా, సీఎం రేవంత్ కనుసన్నల్లోనే తనపై హత్యాయత్నం జరిగిందని కౌశిక్ ఆరోపించారు.  

రోజంతా హైడ్రామా

ఎమ్మెల్యే గాంధీ నివాసంపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని కౌశిక్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంతో పాటు బీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌశిక్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మల్లారెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్కా జిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నివాసాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా హౌజ్ అరెస్టు చేశారు. అయిన ప్పటికీ, కౌశిక్‌రెడ్డి పోలీసుల కళ్లుగప్పి బాచుపల్లిలోని శంభీపూర్ రాజు ఇంటికి చేరుకొన్నారు. ఆసుపత్రికి వెళ్లాలని కోకాపేటలోని నివాసం నుంచి బయలుదేరిన హరీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారు.

ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న తలసానిని సైతం డాక్టర్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. హరీష్‌రావును పరామర్శించేందుకు కోకాపేటలోని నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతిస్తేనే హరీష్‌రావును కలిసేందుకు పంపిస్తామని తేల్చి చెప్పారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగాయి. 

తెలంగాణ నీ అయ్య జాగీరా?: అరికెపూడి

కౌశిక్‌రెడ్డి రౌడీలా వ్యవహరిస్తున్నారని అరికెపూడి గాంధీ విమర్శించారు. తనతో మాట్లాడేందుకు బీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకులే లేరా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ జూనియర్ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యుడిని దుర్భాషలాడిన తీరు సరైంది కాదని అన్నారు. ‘కౌశిక్‌రెడ్డి.. నువ్వేమైనా రౌడీవా? మీ ఇంటికి వస్తా.. కండువా వేస్తా అని చెప్పడానికి పార్టీలో సీనియర్లు లేరా? గతంలో కూడా నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పార్టీకి అపవాదు తెచ్చావు.

మహిళా గవర్నర్ గురించి మాట్లాడిన మాటలు మర్చిపోయావా? మహిళల చీర, గాజుల గురించి మాట్లాడిన నీవు రాష్ట్ర, దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు తిడుతూ ఉంటే ఎంతకాలం నోరు మూసుకుని ఉండాలి? తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగీరా? నువు నిక్కరు వేసుకున్న రోజుల్లోనే నేను హైదరాబాద్ వచ్చిన. మద్రాస్ నుంచి విడిపోయిన ప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలేదు’ అని గాంధీ అన్నారు.

తన ఇంటికి వస్తానని చెప్పిన వారికి టిఫిన్, లంచ్ ఏర్పాటు చేస్తానని చెప్పి గాంధీ తన నివాసంలో బీఆర్‌ఎస్ నేతల కోసం ప్రత్యేక కూర్చీలు వేసి ఉంచారు. ఒక చీటర్‌ను, కోవర్డును పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెంచి పోషించడం ద్వారానే బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని తెలిపారు. ప్రజల మధ్యలో ప్రాతీయ విబేధాలు తీసుకొచ్చి చిచ్చు పెట్టేందుకు కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ ధ్వజమెత్తారు. ప్రాంతీయ విబేధాలపై ఎలాంటి సమస్య వచ్చినా వాటిని అధిగమించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, వారు తనను ఆదరించి, ఆశీర్వదించారని తెలిపారు.  

సీఎం ఆదేశాలతోనే నాపై హత్యాయత్నం: కౌశిక్ రెడ్డి 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తన గూండాలతో తనను చంపేందుకు కుట్ర చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శంభీపూర్ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ వల్లనే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదని, కేసీఆర్ వల్లనే రాష్ట్రం ఆవిర్భించిందని తెలిపారు.

‘నాపై ఇంటిపై జరిగిన దాడిలో 30 40 మంది గూండాలను సైబరాబాద్ పోలీసులు అడ్డుకోలేకపోయారా? ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టు చెప్పినందునే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారు. గాంధీ.. నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే నీ మెడలో బీఆర్‌ఎస్ కండువా వేసుకోవాలి. శేరిలింగంపల్లి ప్రజలు గాంధీ ముఖం చూసి ఓట్లు వేయలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ముఖాలు చూసే ఓట్లు వేసి గెలిపించారు. నేను ఎక్కడా సెటిలర్లు అనే పదం వాడలేదు.

ఒకవేళ ఆంధ్రా అనే పదం వాడి ఉంటే అది కచ్చితంగా గాంధీని ఉద్దేశించి మాత్రమే. నన్ను కరీంనగర్ నుంచి ఎందుకు వచ్చినవ్ అన్నడు. అందుకే నేను గాంధీపై విమర్శలు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ పార్టీకి సెటిలర్లకు ఉన్న బంధాన్ని ఎవరూ తెంచలేరు. హైకోర్టు తీర్పు తర్వాత ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు. ఆ 10 స్థానాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుంది. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడవదు’ అని కౌశిక్ హెచ్చరించారు.