* కొనసాగుతున్న సహాయక చర్యలు
* 100అడుగులకు చేరుకున్న నీటి మట్టం
* చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు శ్రమిస్తున్న ప్రత్యేక బృందాలు
* అక్రమంగా గనులు నిర్వహిస్తున్నారన్న సీఎం హిమంత బిశ్వశర్మ
న్యూఢిల్లీ, జనవరి 7: అసోం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గనిలో నీటిమట్టం 100 అడుగులకు చేరుకోవడంతో కార్మికులను రక్షించేందుకు విశాఖ పట్టణం నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 30 మంది సభ్యుల బృందం వెళ్లింది.
అసోం రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అసోం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. గని నుంచి నీటిని బయటకు పంపడానికి రెండు పంపింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు.
అధికారులు 9 మంది కార్మికులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఆకస్మాత్తుగా నీటి ప్రవాహం రావడంతో సుమారు 15 మంది దాకా గనిలోనే ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. చిక్కుకున్న కూలీల్లో గంగా బహదూర్ శ్రేత్, హుస్సేన్ అలీ, జాకీర్ హుస్సేన్, సర్ప బర్మన్, ముస్తఫా సేఖ్, ఖుషీ మోహన్ రాయ్, సంజిత్ సర్కార్, లిజన్ మగర్, శరత్ గోయారీగా గుర్తించారు.
వరదలు సంభవించినప్పుడు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, దీంతో కార్మికులు తప్పించుకోలేకపోయారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండడంతో కార్మికులను రక్షించేందుకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి..
గనిలో వరదలు సంభవించి 9 మంది కార్మికులు చిక్కుకుపోవడంపై సీఎం హిమంత బిశ్వశర్మ దిగ్భ్రాంతి చెందారు. బొగ్గు గని చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని, ఘటనపై దర్యాప్తు చేసేందుకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.