27-03-2025 12:00:00 AM
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో కేంద్రంలో ఏ పార్టీ అధి కారంలో ఉన్నా నిధుల కేటాయింపులో అ ధికార భాగస్వామ్యంలో దక్షిణ భారతంపై వివక్ష చూపుతున్నారని, సవతి తల్లి ప్రేమ ను చూపిస్తున్నారనే ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉత్తరాది ప్రాబల్యం స్పష్టంగానే కనిపిస్తున్నది. భారతదేశానికి 14 మంది ప్రధాన మంత్రులుగా వ్యవహరిస్తే పీవీ నరసింహారావు, దేవగౌడలు మాత్రమే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించారు.
12 మంది ప్రధానమంత్రులు ఉత్తర భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తే వారిలో 9 మంది ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రులుగా ఎంపికైనారు. ఆరు దశా బ్దాలపాటు దేశ ఆర్థిక వ్యవస్థని శాసించిన ప్రణాళికా సంఘం, దాని అధ్యక్షులుగా ఉత్తర భారతం నుంచి ప్రధానులుగా వ్యవహరించిన వారు నిధులను పథకాలను ఉ త్తర భారతదేశానికి కేటాయించి దక్షిణ భా రతానికి అన్యాయం చేశారనే ఆరోపణలు బలంగా వినపడేవి.
దక్షిణాదిలో రాజకీయం ఎప్పుడు విభిన్నంగానే కనిపిస్తుంది. గత దశాబ్దంగా డబుల్ ఇంజన్ సర్కార్‌ల ద్వారానే అభివృద్ధి సాధ్యమనే రాజకీయ ప్రచారానికి భిన్నంగానే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలు రాజకీయంగా స్పందిస్తున్నాయి కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దక్షిణాదిలో ఎక్కడా అధికా రం దక్కలేదు. నిధుల కేటాయింపులో, గ్రాంట్‌లు ఇవ్వడంలో, ప్రాజెక్టులకు అనుమతులలో ఉత్తరాది ప్రభావిత కేంద్ర ప్ర భుత్వం దక్షిణాదిపై వివక్షత చూపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పులిమీద పుట్రలా, పుండుమీద కారం చల్లినట్లుగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్వి భజన, వాటి సంఖ్య పెంపులోనూ దక్షిణాదికి అన్యాయం జరగబోతుందనే ఆందోళ న ఆయా రాష్ట్రాలనుంచి, రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ తరుణంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశం దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై గళం ఎత్తింది.
డీలిమిటేషన్ జరిగితే ..
1976 నుండి భారతదేశంలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనని స్తంభింపజేశారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసా రి దేశంలో జనాభా లెక్కల సేకరణ జరగాలి. తరువాత నియోజకవర్గాల పునర్వి భజన కమిషన్ ఏర్పాటు చేసి, డిలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 1952 నా టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసుల ప్రకారంగా లోక్‌సభ స భ్యుల సంఖ్యను 494గా, 1962లో 522గా, 1973లో 543గా నిర్ణయించారు.
జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి, జనాభాను నియంత్రించాలనే లక్ష్యంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాలు నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణని 2001లో 84వ రా జ్యాంగ సవరణ ద్వారా మరొక 25 సంవత్సరాలు నియోజకవర్గాల పునర్విభజనని స్తంభింపజేశారు. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన స్తంభన గడువు ముగిసిపోతున్న తరుణంలో మరొకసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం, వివాదం తెరపైకి వస్తుంది.
2026 జనాభా లెక్కల ప్రకారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తే జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. 1971 నుండి 2011 వరకు నాలుగు దశాబ్దాలలో ఉత్తరప్రదేశ్ జనాభా 11 కోట్లు, బీహార్ జనాభా 5 కో ట్లు పెరిగితే, తమిళనాడు జనాభా 3 కోట్లు, కేరళ జనాభా కోటికి పైగా మాత్రమే పెరిగింది.
కాబట్టి, జనాభా ప్రాతిపదికన ని యోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరుగుదలను అరికట్టలేని ఉత్తర భారతదేశం లాభపడి, నియంత్రించిన దక్షిణాది రాష్ట్రా లు నష్టపోతాయి. దాంతో రాజకీయంగా నూ బలహీనపడతాయి. కేరళలో ప్రస్తుతమున్న 20 లోక్‌సభ స్థానాలలో ఒక్కటి కూడా పెరిగే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం 80 నుంచి 143కు పెరిగే అవకాశం ఉంది.
ఒక్క యూపీలోనే 63 స్థానాలు పెరగవచ్చు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 129 స్థానాల నుంచి 164 మాత్రమే అంటే 35 స్థానాలే పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల దక్షిణాది ప్రాతినిధ్యం 24 నుంచి 18 శాతానికి పడిపోతుంది. దక్షిణాదిలో మొత్తం పెరిగే లోక్‌సభ స్థానాలు (35) ఒక్క బీహార్‌లో పెరిగే స్థానాలకి (39) సమానం కాదు.
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర నామమా త్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుం ది. 42 స్థానాలతో విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభలో బలంగా కనిపించేది కానీ, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ప్రభావం తగ్గిపోయిందనే చెప్పా లి.
పునర్వ్యవస్థీకరణ తర్వాత లోక్‌సభలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నాలుగు ఉత్తరాది రాష్ట్రాల బలం 174 నుంచి 324 పెరగవచ్చు. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత లోక్‌సభలో ఉత్తరాది రాష్ట్రాల బలం 684గాను దక్షిణాది రాష్ట్రా ల బలం 164గా ఉండే అవకాశం ఉంది.
డీలిమిటేషన్ జరిగేనా?
జనాభా లెక్కల సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. కమిషన్ తన రిపోర్టుని అందించడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాల వ్యవధి తీసుకుంటుంది. అయితే, షెడ్యూల్ ప్రకారంగా 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాలి. కానీ, కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా సేకరణను జరగలేదు.
2026 నాటికి పునర్వ్యవస్థీకరణ స్తంభింపజేసిన గడువు పూర్తవుతుంది కాబట్టి, జనా భా లెక్కల సేకరణ జరిగితే 2027లో కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. ఈ కమిటీ రిపో ర్టు ఎప్పటి వరకు ఇస్తుందో తెలియదు. ఈ లోపే 2029 సాధారణ ఎన్నికలు వస్తా యి. కాబట్టి రాబోయే సాధారణ ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అభ్యంతరాలు -పరిష్కారాలు
దక్షిణాది రాష్ట్రాలు దేశ జనాభాలో 18 శాతం వాటాని కలిగి ఉంటే జీడీపీలో 35 శాతం కలిగి ఉన్నాయి. దేశాభివృద్ధిలో రో రింగ్ లయన్స్‌గా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. అలాగే, జనాభా పెరుగుదల నియంత్రణ ద్వారా దేశాభివృద్ధికి మద్దతుగా నిలి చిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వా రా కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి, నియోజక వర్గాల పునర్విభజనని మరో 25 ఏళ్లు స్తంభింపజేయాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రాల విస్తీర్ణం ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేయాలని మరొక సూచన కూడా వస్తున్నది. అయితే జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యా యం జరగకుండా ఉండాలంటే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణకి ఉత్తర భారతానికి ఒక పరిమితిని, దక్షిణ భారతానికి మరొక పరిమితిని నిర్ణయించాలి.
లేదా 2002లో లాగానే లోక్‌సభ నియోజక వ ర్గాల సంఖ్యను పెంచకుండా భౌగోళిక సరిహద్దులను మార్చాలనే ప్రతిపాదన కూడా వస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ పునర్విభజన చేయాల్సిన అవసరం కూడా లేదు. కనుక, దక్షిణాదివారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా పునర్వ్య వస్థీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే ప్రజలలో అపోహలు సృష్టించిన వారవుతారు.
అది దేశ సమగ్రత, సమైక్యతలకు మంచిది కాదనే విషయాన్ని దేశ పాలకులు నాయకులు గమనించాలి. ఇలాంటి సున్నిత విషయంలో బాధ్యతాయుతంగా పార్టీలు నాయకులు ప్రవర్తించాలి. ‘పిల్లల్ని ఎక్కువ మందిని కనండి’ అని కొందరు నాయకులు ప్రజలకు పిలుపునిచ్చే పరిస్థితికి మూలం కూడా ఇదే. ప్రత్యేక దేశ డిమాండ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని డీకే సురేష్ లాంటి మాజీ లోక్‌సభ సభ్యులు మాట్లాడుతున్నారు. కాబట్టి, దేశంలోని దాదాపు అర్ధభాగ ప్రయోజనాలను, ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
వ్యాసకర్త సెల్: 9885465877