డ్రైవర్ మృతి.. 20 మంది విద్యార్థులకు పైగా గాయాలు
నర్సాపూర్, సెప్టెంబర్ 27: ఒకే కళాశాలకు చెందిన బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ బస్సు డ్రైవర్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందగా, సుమారు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ శివారులోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విద్యార్థులను తీసుకొని వస్తున్నది.
ఈ క్రమంలో బస్సు ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాదంలో ఒక బస్ డ్రైవర్ నాగరాజు(50) తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనతో విద్యార్థులు షాక్ గురయ్యారు. గాయాల పాలైన విద్యార్థులు రోదించారు.
ప్రమాద సమాచారాన్ని తెలు సుకున్న కళాశాల సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొ న్నారు. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సాయంతో పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఢీకొన్న రెండు బస్సులు ఒకే కళాశా లకు చెందినవి కావడం విధి వైచిత్రి.