కోడి పందేలు ఆడితే కఠిన చర్యలు
కోడి పందేలు, జూదం నియంత్రణకు పోలీస్ అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మం (విజయక్రాంతి): కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారని, అందులో భాగంగా శుక్రవారం పోలీస్ అధికారులతో కోడి పందేల నిర్వహణకు సంబంధించి టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. కోడి పందాలను నియంత్రించేందుకు డివిజన్, మండల, గ్రామస్ధాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడి పందేలు, జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా కోడి పందేలు, జూదం నిర్వహణకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్‌లు ఇచ్చి ప్రొత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బెట్టింగ్, పేకాట శిబిరాలపై దాడులు చేసి, కేసులు నమోదు చేయాలన్నారు. గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని, కత్తులు కట్టే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. కోడి పందేల నిర్వహణపై నిషేధంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
చైనీస్ మాంజా అమ్మకం లేదా నిల్వపై కఠిన చర్యలు...
చైనీస్ మాంజా వినియోగం, అమ్మకం లేదా నిల్వపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. మానవ ప్రాణాలకు, పక్షులు, జంతువులకు హాని కలిగించే నిషేధిత చైనా మాంజపై ఎస్హెచ్వోలందరూ సీరియస్ గా దృష్టిసారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం కమిషనరేట్ లో షాపుల్లో నాన్ బయో డిగ్రేడబుల్, సింథటిక్ ఉత్పత్తులతో తయారు చేసిన నిషేధిత చైనీస్ మాంజాను కలిగి ఉన్న అమ్ముతున్న దుకాణాలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా మాంజా కొనుగోలు చేసే కస్టమర్లు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో టాస్క్‌ఫోర్స్‌తో పాటు స్ధానిక పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.