01-04-2025 05:18:40 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి..
కందూరి చంద్రశేఖర్ డిమాండ్..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని సిపిఎం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్(CPM District Secretary Chandrashekhar) అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ భూముల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్‌సీయూ గేటు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా సిపిఎం పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెరిగిందని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు. ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించారని పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం ఇది అభ్యంతరకరం, అప్రజాస్వామికమని దీనిని అందరూ ఖండించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.