calender_icon.png 22 October, 2024 | 12:04 AM

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

21-10-2024 06:00:28 PM

మందమర్రి (విజయక్రాంతి): విధి నిర్వహణలో తీవ్రవాదులతో, అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్ అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అమరులను స్మరించుకుంటూ స్టేషన్ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని, విధి నిర్వహణలో తమ అమూల్య ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులను స్మరించుకోవాలని ఆయన సూచించారు.

పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు నిరంతరం తోడుగా ఉంటామనీ, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. సంస్మరణ దినోత్సవం రోజున మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. తీవ్రవాదం ఎక్కువగా ఉన్న సమయంలో అమరులు చేసిన ప్రాణత్యాగం ఫలితంగా ఈ రోజు మనం స్వేచ్చగా ఉన్నామని, వారి పోరాట పటిమను కొనసాగించాల్సిన అవసరం వుందన్నారు. అంతకుముందు అమర వీరుల సంస్మరణ కార్యమానికి విచ్చేసిన ఏసీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ శశిధర్ రెడ్డి, బెల్లంపల్లి సబ్ డివిజన్ సిఐ లు, ఎస్ఐలు, పట్టణ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.