01-03-2025 08:06:35 PM
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య మాదిగ...
మందమర్రి (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ, పోరాటంలో కొంత మంది తమ ప్రాణాలను త్యాగం చేసి, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తూ, వర్గీకరణ ఉద్యమంలో అసులు బాసిన అమరుల త్యాగాలను మాదిగ జాతి ఎన్నటికి మరిచిపోదని మాదిగ హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య మాదిగ, మండల ఇంచార్జ్ జీడి సారంగంలు తెలిపారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ముందుగా వర్గీకరణ ఉద్యమం అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూ, మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగిందని తెలిపారు.
వర్గీకరణ ఉద్యమంలో వీరమరణం పొంది, జాతిని, జాతి ఔన్నత్యాన్ని, జాతి అస్తిత్వాన్ని కాపాడిన ప్రతి అమరుడికి ఈ సందర్భంగా జోహార్లు తెలియజేశారు. మార్చి 2న జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మార్చి 6న మంచిర్యాల పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఈ ర్యాలీకి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. లక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమం విజయవంతానికి జాతి మొత్తం ఏకమవుతుండగా, దానిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తొందరతొందరగా నామమాత్రంగా వర్గీకరణ చేసిందని ఆరోపించారు. డాక్టర్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని, సంపూర్ణ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. లబ్ధి పొందని కులాలు లబ్ధి పొందని జాబితాలో ఉండాలని, అదేవిధంగా మద్యస్థంగా లబ్ధి పొందిన కులాలు మద్యస్థంగా ఉండాలని సూచించారు.
ఏబీసీ వర్గీకరణ చేసి కొన్ని కులాలకు అన్యాయం చేస్తామంటే జాతి సహించదన్నారు. వెంటనే షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదన మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని, అదే విధంగా తక్షణమే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసిన పార్టీకి మాదిగ జాతి ఎప్పుడు విస్మరించదని స్పష్టం చేశారు. వర్గీకరణ పోరాటంలో పట్టణంలో సైతం పెరక నరసయ్య, గిన్నారపు రవి, జూపాక సంపత్ తదితరులు అమరులయ్యారని, వారి పోరాటాలు చిరకాలం గుర్తు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు చిలుముల రాజ్ కుమార్, వీహెచ్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామ్ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి తైదల జంపయ్య, నాయకులు సప్పిడి శ్రీనివాస్, రత్నం మొగిలి, వేల్పుల మధునయ్య, కాపల్లి కుమార్, వేల్పుల రాజారం, నందిపాట రవి, కన్నూరి రాజేందర్ లు పాల్గొన్నారు.