హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): కార్గిల్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జేఎన్టీయూహెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు అన్నారు. శుక్రవారం కార్గిల్ దివస్ సందర్భంగా జేఎన్టీయూహెచ్ క్యాంటీన్ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సైనికులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం లో విద్యార్థి నాయకులు రాహుల్ నాయక్, బ్రహ్మంగౌడ్, శివ కృష్ణ, సిద్ధార్థ, చంద్రశేఖర్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట జిల్లా అదనపు డీసీపీ మల్లారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని సిద్దిపేట ఏసీపీ మధు ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో కలిసి స్థానిక బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి, వన్‌టౌన్ సీఐ లక్ష్మిబాబు, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి: బీబీ నగర్‌లోని సాంఘిక సంక్షేమ ఆర్మీ శిక్షణ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర జవానులకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్మీ కెప్టెన్ రాఖీ చౌహాన్ పాల్గొన్నారు.
గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నారాయణఖేడ్‌లో యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఖేడ్ సీఐ శ్రీనివాస్‌రెడి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.