19-04-2025 01:46:04 AM
హైదరాబాద్/ములుగు/ఆదిలాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో భూసమస్యల శాశ్వత పరిష్కారాని కి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఓ అధికారిక కమిటీని నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. అది గిరిజన ప్రాంతమైనా, గిరిజనేతర ప్రాంత మైనా.. భూసమస్య అన్నది లేని రాష్ట్రా న్ని చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.
ములుగు జిల్లా వెంకటాపూర్, ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పుసాయ్ గ్రామంలో శుక్రవారం ఆయన మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి భూభారతి పైలె ట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో కుట్రపూరితంగా పార్ట్ బీలో నమోదు చేసిన 18 లక్షల ఎకరాల్లో 6- 7 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని, ఆ భూయజమానులకు భూభారతి చట్టంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని, కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనిచేసి చూపించామని వెల్లడించారు. ధరణిపై గత పాలకులు ఏనాడూ రెవెన్యూ సదస్సులు నిర్వహించలేదని, ఒకవేళ సదస్సులు నిర్వహించి ఉంటే మాత్రం రైతులు తిరగబడే వారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సరైన డాక్యుమెంట్లు లేకుండా అబాదీ ఇళ్లలో ఉంటున్న కుటుంబాలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. భూభారతి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ, సీసీఎల్‌ఏ కార్యాలయానికి అనుసంధానిస్తూ టోల్‌ఫ్రీం నంబర్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఆ నంబర్‌ను ప్రకటిస్తామని, ప్రజలు భూభారతి సమస్యలను నివేదించేందుకు ఆ నంబర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
2020 ధరణి చట్టంలో సాదా బైనామా అనే కాలమ్‌ను నాటి ప్రభుత్వం తొలగించిందని, తమ ప్రభుత్వం మాత్రం అలా చేయదని తేల్చిచెప్పారు. సాదా బైనామాకు అందిన 9.24 లక్షల దరఖాస్తులను పరిశీలించి, సక్రమంగా ఉన్న సాదా బైనామాలను ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. భూభారతి చట్టంలో భూమి ఎవరి కాస్తులో ఉంటుందో వారికే పాస్‌బుక్ ఇస్తామని స్పష్టం చేశారు.
రెవెన్యశాఖ అధికారులు గ్రామాలకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. భూభారతి చట్టంతో తమకు న్యాయం జరగలేదని ఎవరూ నిరాశ చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులెవరైనా సమస్యలు ఎదుర్కొంటుంటే.. వాటిని తమ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మొద్దని హెచ్చరించారు.
భూభారతి ప్రారంభోత్సవాల్లో ఎంపీలు బలరాం నాయక్, గోడం నగేశ్, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధప్రకాశ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ములుగు కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.
అపోహలు, ఆందోళన వద్దు: మంత్రి సీతక్క
భూభారతి అమలుపై రైతులెవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఏమాత్రం ఆందోళన చెందొద్దని, తమ ప్రభుత్వం ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క భరోసానిచ్చారు. గత పాలకులు ధరణి పేరుతో రైతులను దగా చేశారని, అధికారులను బెదిరించి వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.
వారు ఆక్రమించుకున్న భూములను తమ ప్రభుత్వం కాపాడుతుందని వెల్లడించారు. భూభారతి చట్టం అమలుతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. 18 రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి మరీ తమ ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. భూ భారతి అమలులోకి వచ్చాక రైతులు ఊపిరి తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.