calender_icon.png 25 December, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకం

24-12-2024 02:10:34 AM

  • యువత చేతిలోనే దేశ భవిష్యత్
  • రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సిద్దిపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి): దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రమ శిక్షణకు మారుపేరు ఏబీవీపీ అని, దాని ఫలితమే నాటి కార్యకర్తలు నేడు ఉన్నతంగా స్థిరపడ్డారని చెప్పారు. ఏబీవీపీ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తుందన్నారు.

ఏబీవీపీలో పని చేసిన కార్యకర్త ఎంత పెద్ద నాయకునిగా ఎదిగినప్పటికి జాతీయ భావాలను కలిగి ఉంటారని చెప్పారు. విద్యార్థి దశలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో మంచి నాయకునిగా ఎదుగుతారని తెలిపారు. అఖిల భారత సంఘటన జాతీయ కార్యదర్శి ఆశిష్ చౌహన్ మాట్లాడుతూ ఏబీవీపీ ప్రస్థానం అన్నింటికన్న భిన్నమైందని, హిందీ భాషాను జాతీయ భాషగా గుర్తించాలని మొదటిగా ప్రతిపాదించింది ఏబీవీపీయేనని గుర్తు చేశారు.

55 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వాలతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ గుర్తింపుపొందిందన్నారు. అంతకు ముందు ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జానారెడ్డి, కార్యదర్శిగా రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునంధన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఏబీవీపీ జాతీయ సంయుక్త కార్యదర్శి కల్యాణి  పాల్గొన్నారు.