calender_icon.png 2 April, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోల పాత్ర మరువలేనిది!

23-03-2025 12:00:00 AM

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి.. ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరడానికి వెన్నుముఖలా నిలిచారు టీఎన్జీవోలు. సకలజనుల సమ్మెకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి జేఏసీగా ఏర్పడిన ఉద్యోగులు కదంతొక్కారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మూల స్తంభాలుగా నిలిచి, పోరాటం సాగించారు. ఎక్కడికక్కడ ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ ప్రజలను చైతన్యం చేశారు. అందులో ముఖ్యంగా మెదక్ జిల్లా టీఎన్జీవోల పాత్ర ప్రత్యేకమైనది. 

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఎన్జీవోలు అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలను చైతన్య పరిచే విధంగా ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. ప్రజాచైతన్య సమావేశాలకు ఫంక్షన్ హాల్స్ ఇస్తే సీజ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించినప్పటికీ తెలంగాణవ్యాప్తంగా అన్ని తాలూకా, జిల్లా హెడ్ క్వార్టర్లలో, టీఎన్జీవో భవనాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరిచాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, కుల, మత ప్రజా సంఘాలను సైతం మమేకం చేసి రాజకీయ జేఏసీగా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత టీఎన్జీవోలది. 

వినూత్న కార్యక్రమాల ద్వారా.. 

హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై రాజకీయ జేఏసీ భాగస్వామ్యంతో మిలియన్ మార్చ్, జలవిహార్ వద్ద సాగరహారం, ఢిల్లీ నడిబొడ్డున సంసద్ యాత్ర.. ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగుల పెన్‌డౌన్, చాక్‌డౌన్, టూల్‌డౌన్ చేపట్టారు. 16 రోజుల సహాయ నిరాకరణ చివరగా తెలంగాణ ప్రజలను ఏకం చేసి 42 రోజుల సకలజనుల సమ్మెలో వినూత్నమైన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, వంటావార్పులు, మానవహారాలు, రహదారుల దిగ్బంధం, రైల్‌రోకో నిర్వహించారు. దసరా, దీపావళి పండుగలు వచ్చినా మాకు జీతాలు ముఖ్యం కాదు జీవితాలే ప్రధానమని, చిన్నస్థాయి ఉద్యోగులకు చందాలు చేసి వారి పండుగలకు, పబ్బాలకు సొమ్ము సమకూర్చిన ఘటనలు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సైతం జీతం చేయకుండా ఆపిన ఘనత టీఎన్జీవోలది. ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షాని నెరవేర్చడమే లక్ష్యంగా ఉద్యమంలో మెదక్ జిల్లా టీఎన్జీవోలది కీలక పాత్రగా చెప్పవచ్చు. 

ప్రత్యేక రాష్ట్రంలో..

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎన్జీవోల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. పాలకులు స్వరాష్ట్రం కోసం ప్రేరేపించిన విధంగా రాష్ట్రం సిద్ధించాక టీఎన్జీవోల పాత్రను కనుమరుగు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పాలకులు తమ స్వార్థం చూసుకున్నారు తప్ప ఉద్యోగుల కనీస హక్కులను తీర్చలేకపోయారు. పీఆర్సీ, డీఏలు చెల్లిస్తున్నామని ఆశలు చూపి తూతూ మంత్రంగా పెంచి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలపై, డీఏపై ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యమంలో నడుం బిగించిన ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి నెట్టివేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

 విజయక్రాంతి, మెదక్ 

బెదిరింపులను సైతం లెక్కజేయలేదు!

తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని దశాబ్దం పూర్తయింది. ఆ సమయంలో టీఎన్జీల పాత్ర, ముఖ్యంగా మెదక్ జిల్లా జేఏసీ ఉద్యోగులు చేసిన ఉద్యమ స్ఫూర్తి మరువలేనిది. ఉద్యమంలో పాల్గొంటే ఉద్యోగాలు ఊడుతాయన్న బెదిరింపులను సైతం లెక్కజేయకుండా ప్రతి ఒక్కరం ఉద్యమంలో కదంతొక్కారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత వరకు న్యాయం జరిగినా ఆశించిన మేర సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన ఉద్యోగుల సమస్యలను ఇప్పటి ప్రభుత్వమన్నా పరిష్కరించాలి.

 దొంత నరేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు