14-02-2025 12:28:56 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ -2 అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్టేజ్ -2 అధికారులు కీలకంగా వ్యవహరించాలని, ఈయనే కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే అధికారిగా ఉంటారన్నారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు నిబద్ధతతో పని చేయాలని తెలిపారు. రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లతో విధులు నిర్వహించే వారితో వెళ్లి పోలింగ్ కేంద్రాల్లో ఉండి మరుసటి రోజు ఎన్నికలు నిర్వహించుకుని వార్డ్ వైజ్ , కౌంటింగ్, సర్పంచ్ కౌంటింగ్ చేసి ఉప సర్పంచిని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వార్డ్ మెంబర్స్, సర్పంచ్ ఎంపికలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి,జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, విద్యాశాఖ అధికారి రాధా కిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత స్టేజ్-2 అధికారులు తదితరులు పాల్గొన్నారు.