పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 14: నిర్మాణ రంగంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తారా కన్వెన్షన్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్లొమా ఇంజినీర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశా నికి మంత్రి సీతక్క, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో సీతక్క మాట్లాడుతూ... యువ ఇంజనీర్లు మోక్షగుండ విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మూడు నాలుగు రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఇంజినీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
పనిభారం తగ్గించేలా త్వరలోనే కొత్తవారిని రిక్రూట్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌వోడీఈ ప్రెసిడెంట్ శివానంద హుజర్, ఏఐఎఫ్‌వోడీఈ ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌రాజ్ టోంగ్లీ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజినీర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం ఇంద్రాసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.