పెరుగుతున్న అన్ని సరుకుల ధరలను తగ్గించాలి
జూన్ 10న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయండి
పాల్వంచ, జూన్ 9, (విజయక్రాంతి): ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు కోరారు. మంగళవారం పాల్వంచ మండలం నారాయణరావుపేట, నాగారం, బోజ్యా తండా, తోగ్గూడెం, నాగారం కాలనీ, రంగాపురం, బిక్కు తండా, సోమల గూడెం, పునుకుల, లక్ష్మీదేవి పల్లి ఎస్, బసవతారక కాలనీ, కోడిపుంజుల వాగు, కిన్నెరసాని, పాండురం గాపురం, మొండికట్ట, ఉల్వనూరు, రేగుల గూడెం తదితర గ్రామాలలో ధర్నా విజయవంతం చేయాలని కరపత్రాలు పంచి ప్రచార సభలు నిర్వహించారు. ఈ ప్రచార సభలను ఉద్దేశించి మాట్లాడుతూ...
దేశంలో, రాష్ట్రంలో పాలకులు ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని రకాల సరుకుల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలను కొనలేని తినలేని పరిస్థితికి నెట్టివేస్తు న్నారని. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పటికీ మన దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఇష్టాను రీతిగా పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారన్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభమై రైతాంగం దుక్కులు, విత్తనాలు, ఎరువులు పంట పెట్టుబడికి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగే పరిస్థితి ఏర్పడిందని ఇది పాలకుల పాపమేనన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో గ్రామ శాఖ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు మేక రాంబాబు, జి నాగయ్య, సత్యనా రాయణ రెడ్డి, వినోద్, సాయిలు శ్రీను, బి రంజిత్, సిహెచ్ శ్రీను, జర్పుల మోహన్, జరుపుల రాంబాబు (ఉపసర్పంచ్), ప్రశాంత్, సంతోష్, తేజావత్ వినోద్ (సర్పంచ్), మాలోత్ హరి (సర్పంచ్), భూక్య ఝాన్సీ (సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.






