వారణాసిలోని 115 ఏళ్ల నాటి కళాశాల భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్
ఖండించిన ఉదయ్‌ప్రతాప్ కాలేజీ యాజమాన్యం
వారణాసి, నవంబర్ 29: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 115 ఏళ్ల చరిత్ర కలిగిన ఉదయ్ ప్రతాప్ కాలేజీ యాజమాన్యం తమదేనని యూపీ వక్ఫ్ బోర్డు ప్రకటనతో వివాదం చెలరేగింది. 2018 నుంచే వక్ఫ్ బోర్డు ఈ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ మరోసారి తెరపైకి వచ్చింది. 2018 డిసెంబర్‌లో చోటి మసీదు, ప్రాంగణంలోని అనుబంధిత ఆస్తిని టోంక్ నవాబ్ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని కళాశాలకు బోర్డు నోటీసులు పంపింది.
దీన్ని బోర్డు నియంత్రణకు బదిలీ చేయాలని పేర్కొంది. 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న ఈ కాలేజీ స్థలం చారిత్రక మసీదుతో ముడిపడి ఉండటంతో ఇది వక్ఫ్ ఆస్తి అని యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొంటోంది. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ భూమి 1909లో స్వచ్ఛంద ఎండోమెంట్ ద్వారా స్థాపించారని, బదిలీ లేదా విక్రయించడం సాధ్యం కాదని తెలిపింది.