calender_icon.png 15 January, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణల చెరలో కుడి చెరువు

10-09-2024 01:22:01 AM

  1. చేర్యాల కుడి చెరువు ఆక్రమణలపై స్థానికుల ఆందోళన 
  2. సర్వేలు చేసినా హద్దులు గుర్తించని అధికారులు 
  3. ప్రజలకు శాపంగా రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల చేతివాటం 
  4. వర్షం కురిస్తే ఇళ్లల్లోకి వరద నీరు

సిద్దిపేట/చేర్యాల, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణలకు అడ్డూఅదు పు లేకుండా పోయింది. ఎక్కడికక్కడ కబ్జా కోరల్లో చిక్కుకుపోతున్నాయి. చెరువులు క్రమంగా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని చెప్పడానికి సిద్దిపేట జిల్లా చేర్యాల కుడి చెరువు నిదర్శనంగా నిలుస్తోంది. చేర్యాల గ్రామానికి ఆనుకొని, సిద్దిపేట రహదారి పక్కనే ఈ కుడి చెరువు ఉంది. ఈ ప్రాంతంలో భూమికి డిమాండ్ అధికంగా ఉంటుంది.

అయితే, గత పాలకులు, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెం చర్లు చేసినా అడ్డు చెప్పలేదు. దాని ఫలితం గా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నాలాలు వంటివి ఏవీ వదలకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఓ మోస్తరుగా వర్షం కురిసిన ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరుతోంది. చేర్యాల పట్టణంలోని వర్షం నీరంతా లోత ట్టు ప్రాంతంలోనే నిలిచి ప్రజలకు, ప్రయాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

60 ఎకరాలు..

202 సర్వే నంబర్‌లో చేర్యాల కుడి చెరు వు 60 ఎకరాల 21 గుంటలు ఉండాలి. సర్వే నంబర్ 203లో 19 ఎకరాల 23 గుంటల పట్టా భూమి ఉండాలి. కానీ పట్టా భూమి పూర్తిగా వెంచర్లుగా మారిపోవడంతో పాటు కుడి చెరువు ఎఫ్‌టీఎల్, శిఖం, బఫర్ జోన్ పరిధి ఏదీ వదలకుండా నిర్మాణాలు చేపట్టా రు. కుడి చెరువు కబ్జాకు గురైందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి అధికారులు పలుమార్లు సర్వేలు చేసినా హద్దులు మాత్రం గుర్తించలేదు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పాటు సర్వే చేసిన అధికారులకు మామూళ్ల రూపంలో మేలు జరి గిందనే ఆరోపణలు ఉన్నాయి.

కుడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు, బ్యాంక్ రుణాలు పొందడం గమనార్హం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడుతున్నారు. చేర్యాల పట్టణంలో నుంచి చెరువుకు నాలుగు నాలా లు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కట్టడాలతో దర్శనమిస్తున్నాయి. దీంతో చేర్యాలలోని గాంధీ చౌరస్తా, యూనియన్ బ్యాంక్ సమీపంలో వర్షం కురిసినప్పుడు జలమయం అవుతోం ది. వర్షం కురిసిన ప్రతిసారి నీరు ఇళ్ల మధ్యలోనే నిలవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వ భూములను పరిరక్షించాలని..

సిద్దిపేట జిల్లా చేర్యాలలో హైడ్రా తరహాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కమిటీని నియమించాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కుడి చెరువుతో పాటు పట్టణ సమీపంలోని కుంటలను పరిరక్షించాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. కుడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాల ను కూల్చితే తప్ప చేర్యాల పట్టణానికి మేలు జరగదని అంటున్నారు. చేర్యాల ప్రజల ఇబ్బందులపై కుడి చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారని ఎదురు చూస్తున్నారు.