07-04-2025 05:49:15 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
కొల్చారం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రవేశపెట్టడం శుభపరిణామం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం రాంపూర్ లో సన్నబియ్యం లబ్ధిదారు దుర్గ రాజు గృహంలో కుటుంబం సభ్యులతో కలిసి భోజనం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కొల్చారం మండలం రాంపూర్ లో విస్తృతంగా పర్యటించి సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గరాజు కుటుంబ సభ్యులు సన్న బియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
సన్న బియ్యం అన్నంతో కడుపునిండా అన్నం తింటున్నామని, ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం" అని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 07 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. సన్న బియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకుని దొడ్డు బియ్యం క్వాలిటీ బాగోలేక రీసైకిలింగ్ చేయడం, వేరే వారికి అమ్మడం జరిగేదని తెలిపారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్న బియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిదారుల స్పందన తెలుసుకోవడానికి కుల్చారం మండలం రాంపూర్ గ్రామ సందర్శించడానికి రావడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నామని అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని లబ్ధిదారు స్వయంగా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.