ట్రైసా చైర్మన్ రవీందర్‌రెడ్డి, వీఆర్వో జేఏసీ చైర్మన్ సతీశ్
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో తిరిగి వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై ట్రైసా చైర్మన్ వంగా రవీందర్‌రెడ్డి, వీఆర్వో జేఏసీ చైర్మన్ సతీశ్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం వీరు రాష్ట్ర రెవెన్యూ, సమచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థతో రైతుల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పూర్వపు వీఆర్వోలు తిరిగి ఆత్మగౌరవంతో బతుకుతారని తెలిపారు. గత సర్వీసును పరిగణలోకి తీసుకుని తమకు కామన్ సీనియార్టిని ఫిక్స్ చేయాలని మంత్రిని కోరారు.
అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పలు సంఘాల నేతలు పల్లెపాటి నరేశ్, వైస్ చైర్మన్ ఎస్కే మౌలానా, చింతల మురళి తదితరులు ఉన్నారు.