calender_icon.png 27 October, 2024 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిస్తీలకే రెవెన్యూ ఖల్లాస్

12-08-2024 12:58:41 AM

జీతాలు, పెన్షన్లు కలిపితే 62 శాతం హాంఫట్!

  1. రెవెన్యూ వ్యయంలో 15శాతం వడ్డీలకే 
  2. మొత్తం ఆదాయంలో అప్పుల వాటా 26.99 శాతం
  3. నెలనెలా ఆర్‌బీఐ వద్ద పెరుగుతున్న అప్పులు
  4. రెండు వారాల్లోనే రూ. 6 వేల కోట్ల రుణం

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మరికొంత సమయం పట్టేటట్టు కనిపిస్తోంది. గత తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా.. గత సర్కారు సృష్టించిన ఆర్థిక అస్థిరత వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అందుకే ఇప్పుడు అప్పులు చేయనిదే, ప్రభుత్వం ముందుకుసాగని పరిస్థితి నెలకొంది. తెలంగాణ సర్కారు చేస్తున్న ఖర్చులో దాదాపు 62 శాతం వాటా జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలదే కావడం గమనార్హం.

ఇందులో కూడా 15 శాతం వాటా కిస్తీలదే అని కాగ్ నివేదిక చెబుతోంది. 2024 ఆర్థిక సంవత్స రంలో మొదటి త్రైమాసికంలో రెవెన్యూ వ్యయం రూ.39,262.10 కోట్లు కాగా.. ఇందులో వడ్డీలు రూ.5,933.05 కోట్లు, జీతాలు రూ.11,026.69 కోట్లు, పింఛన్లు రూ.4,311.62, సబ్సిడీ రూ.3,354.21 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో దాదాపు 62 శాతం వాటా ఈ నాలుగు విభాగాలదే కావడంతో.. మిగతా ఖర్చులకు ప్రభుత్వం వెనుకాడాల్సి వస్తోంది. ముఖ్యంగా కొత్త ప్రాజె క్టులు, అభివృద్ధి పనులను చేపట్టాలంటే, ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

రూ.7వేల కోట్లు దాటే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం రాబడిలో అప్పుల వాటా ఎక్కువ మొత్తంలో ఉండటం గమనార్హం. వాస్తవానికి ప్రభు త్వం చేసిన అప్పులను కలుపుకొని.. మొత్తం రాబడిని లెక్కిస్తారు. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఇప్పటివరకు మొత్తం ఆదాయంలో అప్పుల వాటా 26.99 శాతమని కాగ్ నివేదిక చెబుతోంది. 2024 మొదటి త్రైమాసికం లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాబడి రూ. 48,790.66 కోట్లు కాగా.. ఇందులో అప్పులు రూ.13,180.99 కోట్లు హ్  ఉన్నాయి. గత 9 నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో దాదాపు రూ.6వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసునుంది. ఇప్పటికే ఈనెల 6వ తేదీన రూ.3వేల కోట్ల రుణాన్ని తీసుకున్న సర్కారు.. ఈనెల 9వ తేదీన మరో రూ.3వేల కోట్లు తీసుకునేందుకు ఆర్‌బీఐ వద్దకు వేలానికి వెళ్లింది. ఈనెల 13న ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ విడుదల చేయనుంది. ఈనెల పూర్తయ్యే సరికి ప్రభుత్వం మరికొంత రుణం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జులై నెలలో గరిష్టంగా రూ.7వేల కోట్ల రుణాన్ని ఆర్‌బీఐ వద్ద తీసుకుంది. అయితే ఆగస్టులో రూ.7వేల కోట్ల దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

గతేడాది కంటే తగ్గిన అప్పులు

2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం చేసిన రుణాల కంటే.. ఈ ఏడాది తగ్గాయి. గతేడాది ఇదే సమయానికి రూ.15,876.48 కోట్లను ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద రుణంగా తీసుకోగా.. ఈ ఏడాది రూ.13,171.. కోట్లను పొందింది. అంటే గతేడాది కంటే.. దాదాపు రు.2,705.48 కోట్లు తక్కువ కావడం గమనార్హం.

ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ..

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తగ్గట్టు ప్రభుత్వ ఖర్చు లేదని కాగ్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.48790. 66కోట్లు కాగా.. ఖర్చు చేసిన మొత్తం రూ.45320.12 మాత్రమే. ఆదాయం కంటే రూ.3,470.54కోట్లను ప్రభుత్వం తక్కువగా ఖర్చు చేసినట్లు పేర్కొంది.