calender_icon.png 23 October, 2024 | 6:59 AM

వ్యక్తుల ఇష్ట ప్రకారమే కుల, మతాల వెల్లడి

23-10-2024 02:42:25 AM

  1. దీనిపై విడిగా ఉత్తర్వులు అవసరం లేదు 
  2. తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కుల, మతాల వివరాలను వెల్లడించడమన్నది ఆయా వక్తులు ఇష్టానుసారమే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏ మతంపై విశ్వాసంలేని వ్యక్తి మతం గురించి చెప్పాల్సిన అవసరంలేదని కూడా అన్నది. కుల, మతాలను వెల్లడించలేదన్న కారణంగా పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేశాయని, అందువల్ల కుల, మతాల ప్రస్తావన లేని దరఖాస్తుల రూపకల్పనపై ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయలేమని చెప్పింది.

దీనికి సంబంధించిన పిల్‌పై విచారణను ముగించింది. పాఠశాల టీసీ, అడ్మిషన్ దరఖాస్తుల్లో కులం, మతం అనుసరించని వాళ్లకు వాటి గురించి వెల్లడించకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక కాలమ్ పెట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ డీవీ రామ కష్ణారావు, మరొకరు 2017లో దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

సెయింట్ ఆన్స్ పాఠశాల కులం, మతం వివరాలు లేకుండా పిల్లల అడ్మిషన్ దరఖాస్తును స్వీకరించకపోవడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారని పేర్కొంది. ఇదే అంశంపై పిల్ దాఖలు చేశారంది. కులం, మతం వివరాలు వెల్లడించకుండా అడ్మిషన్లు నిరాకరించారన్న వారి వివరాలను పిటిషనర్ సమర్పించలేదంది.

టీసీ, అడ్మిషన్ దరఖాస్తుల్లో కుల, మతాల గురించి ఇష్టంలేకపోతే ‘నిల్’ అని రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ ఉత్వర్వులు జారీచేసిందని, పదో తరగతి సర్టిఫికెట్లో కుల, మతాల ప్రస్తావన లేదని ప్రభుత్వం వెల్లడించిందని పేర్కొంది. కుల, మతాల ప్రస్తావన అవసరం లేదన్న ప్రజల వివరాలు లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.