calender_icon.png 17 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లకు!

17-11-2024 01:45:25 AM

రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో..

కొంతకాలమైనా తీరనున్న ఆచార్యుల కొరత

హైదరాబాద్, నవంబర్ 16(విజయ క్రాంతి):  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విర మణ వయస్సును పెంచనున్నారు. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచే అంశాన్ని రేవంత్ ప్రభు త్వం పరిశీలిస్తున్నది.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను సర్కారు వేగవం తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ను కేసీఆర్ ప్రభుత్వం గతంలో 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిన విష యం తెలిసిందే. అయితే రాష్ర్టంలోని యూనివర్సిటీ అధ్యాపకులు మాత్రం 60 ఏండ్లకే రిటైర్మెంట్ అవుతున్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రొఫెసర్లు 65 ఏండ్ల వరకు పనిచేయవచ్చు. ఈనేపథ్యంలో రాష్ర్టంలోని యూనివర్సిటీల్లో యూజీసీ నిబంధనలను అమలుచేసి, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 ఏండ్లకు పెంచాలని యూనివర్సిటీ టీచర్ సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గత ప్రభుత్వంలోనూ పలు మార్లు మంత్రులు, అధికారులకు కలిసి వినతిపత్రాలను సమర్పించారు.

తగ్గుతున్న ప్రొఫెసర్ల సంఖ్య..

రాష్ర్టంలోని 12 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత సమస్య వేధిస్తున్నది. ఇటీవలీ కాలంలో ఫ్యాకల్టీ పదవీ విరమణలు పెరిగాయి. పలు డిపార్ట్‌మెంట్లలో ఒక్కరంటే ఒక్క ఆచార్యులు కూడా లేరు. దీంతో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ర్టంలోని 12 యూనివర్సిటీల్లో 870 మంది ఆచార్యులు మాత్రమే పనిచేస్తున్నారు.

మొత్తం 2,825 పోస్టులంటే 70శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడంతో దాని ప్రభావం న్యాక్ గుర్తింపుపై ప్రభావం చూపనుంది. కొత్త రిక్రూట్‌మెంట్లు లేకపోవడం, ఉన్నవారు రిటైర్మెంట్లు అవుతుండటంతో న్యాక్ గుర్తింపు దక్కడం అనుమానంగానే ఉంది. మరోవైపు 60 ఏళ్లకు రిటైర్మెంట్ అవుతుండటంతో రాను రాను సీనియర్ ప్రొఫెసర్ల సంఖ్య తగ్గనుంది.

ఇది యూనివర్సిటీల్లో పరిశోధనలకు ఆటంకంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్యుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరో ఐదేళ్లు పెంచితే ఇంకొంత కాలం వరకు ఆచార్యులు తమ సేవలను అందించే వీలుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.

పక్క రాష్ట్రాల్లో అమలు..

ఇదే అంశంపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొ.తిరుపతిరావు కమిటీ సైతం ఆచార్యుల పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వా నికి సూచించింది. ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ సహా మొత్తం 6 రాష్ట్రాల్లో 65 ఏండ్ల కు రిటైర్మెంట్ వయస్సును పెంచి అమలుచేస్తున్నారు.

మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆచార్యుల వయోపరిమితిని పెంచారు. ఇదే అంశంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. వయోపరిమితి ఎంత పెంచితే ఎంత మందికి లాభం కలుగుతుందో నివేదిక ఇవ్వాలని అప్పట్లో ఆదేశించారు.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు మూడు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలు మరుగునపడ్డాయి. మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.