calender_icon.png 31 March, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంక్షల సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలి

21-03-2025 01:40:57 AM

  1. ప్రజాపాలన పేరిట నిర్బంధ ప్రయోగం
  2. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ బంద్ 
  3. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలపై రిజిస్ట్రార్ ఇచ్చిన ఆంక్షల సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో సం  ఆధ్వర్యంలో ఓయూ బంద్ చేపట్టారు.

సందర్భంగా తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. ఆర్ట్స్ కాలేజీ ఎదుట వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌ఎల్ మూర్తి, నెల్లి సత్య, లెనిన్, అనిల్, అల్లూరి విజయ, కోట ఆనందరావు తదితరులు మాట్లాడుతూ ఓయూ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని వారం రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం, ఓయూ వీసీ, రిజిస్ట్రార్ పట్టు వీడటం లేదన్నారు.

ఓయూ అధికారుల వైఖరిని నిరసిస్తూ బంద్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. నిరసనలో విద్యార్థి సంఘాల నాయకులు ఉదయ్, లెనిన్, నాగేందర్, శ్రీను, రాకేశ్, శ్రీను, ఉప్పల ఉదయ్, భగత్, అసిఫ్ గౌతమ్, రహీమ్, ఆర్ఫాన్, పవన్, సురేశ్, భరత్, అరుణ్ పాల్గొన్నారు. 

అడ్మినిస్ట్రేషన్ భవన్ ఎదుట ధర్నా 

అప్రజాస్వామికమైన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్క్యులర్‌ను చించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జార్జిరెడ్డి పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ, డీబీఎస్‌ఏ, బీఆర్‌ఎస్‌వీ, ఎంఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ, ఎస్‌ఎస్‌యూ, డీఎస్‌పీ, జేవీఎస్, డీబీఎస్‌ఏ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియంతృత్వ సర్క్యులర్‌ను ఉపసంహ రించుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

హైకోర్టు నోటీసులు

 ఓయూలో ఎలాంటి నిరసనలు చేపట్టొద్దంటూ జారీ చేసిన సర్క్యులర్‌పై వివరణ ఇవ్వాలంటూ ఓయూ రిజిస్ట్రార్‌తో పాటు ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులిచ్చింది. ఉస్మానియాలో నిరసనలు చేపట్టరాదంటూ మార్చి 13న జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ రఫీ అనే విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ సర్క్యులర్ భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యాశాఖకు, ఉస్మానియా యూనివర్సిటీకి నోటీసులిచ్చారు. విచారణను ఏప్రిల్ 9కు వాయిదా వేశారు.