22-03-2025 11:24:18 PM
‘ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ తలకొక్కుల రాజు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన ఓబిసి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఓబీసీ లాయర్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ తల కొక్కుల రాజు, లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, కన్వీనర్ కోల జనార్దన్ లు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదించడాన్ని స్వాగతిస్తూ తమ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నామన్నారు. శాసనసభలో బిల్లుని ఏకగ్రీవంగా అమోదించేందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు అభినందనలు తెలిపారు.
విద్యా, ఉద్యోగ రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు ఆధారంగా అన్ని లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఉన్న ఏజీపీ, జిపి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియమకాలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని త్రికరణశుద్ధితో పార్లమెంట్ లో అమలు చేసి రాష్ట్రపతి ఆమోదం పొందే విదంగా కృషి చేయాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి ఈచట్టానికి ఉన్న అవరోధాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లేనిపక్షంలో ఓబిసి లాయర్ జెఎసి మిగతా ఓబీసీ సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఈనెల 31న అన్ని సంఘాలతో ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని న్యాయవాద సంఘాలు, నాయకులందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం దేవరాజు గౌడ్ పూస మల్లేశం, టి.రాహుల్ వంశీకృష్ణ, కొండూరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.