calender_icon.png 24 October, 2024 | 4:56 AM

ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ!

24-10-2024 02:43:24 AM

  1. నేడు సీఎంకు అందజేస్తాం
  2. 26న క్యాబినెట్ భేటీలో ఆమోదం
  3. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
  4. సివిల్ సప్లు భవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై తుది నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసినట్లు రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారుసులతో కూడిన తుది నివేదికను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల 26న జరగబోయే రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆమోదిస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లు భవన్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష సమావేశం నిర్వహించింది.

ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ లక్షణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పోచారం శ్రీనివాసరెడ్డి, పీసీసీ నేత మహేష్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీ కాంతరావు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డీయస్ చౌహన్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యం కొనుగోలుపై బ్యాంకు గ్యారెంటీతో పాటు మిల్లింగ్ చార్జీలు పెంచడంవంటి అంశాలపై పలు సిఫారసులు చేసినట్లు తెలిపారు. 

డ్రైయేజ్‌పై ఉపసంఘం అధ్యయనం

మధ్యాహ్న భోజన పథకం, హాస్టల్స్, ఐసీడీఎస్ వంటి పథకాల కింద పంపిణీ చేయడానికి సంబంధించి సన్నబియ్యం (10 శాత పగిలిన బియ్యం)పై ఉన్న ఖర్చులను పెంచడంతో పాటు  వ్యవసాయ శాఖ పాత్ర, ఎస్‌డబ్ల్యూసీ/ఏఎంసీ గోదాముల్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడం, ధాన్యం నిల్వ ఉంచే సమయంలో ‘డ్రైయేజ్’ నష్టంపై ఉపసంఘం అధ్యయనం చేసినట్లు ఉత్తమ్ తెలిపారు.

బ్యాంకు గ్యారెంటీతో పాటు మిల్లింగ్ ఛార్జీల పెంపుదల, నిజామాబాద్ జిల్లాలోని ధాన్యం నిల్వ సామర్థ్యంపై సమీక్షించినట్లు చెప్పారు. వివిధ జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 60.73 లక్షల ఎకరాల భూమిలో ధాన్యం సాగు చేయబడిందని, 146.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు దాన్యం, 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ర్ట ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌ను అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారానికి టోల్-ఫ్రీ నంబర్‌తో  ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.