22-02-2025 12:56:03 AM
మెదక్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): తెలంగాణలో సీఎంలు మారారే తప్ప.. పాలనలో ఎలాంటి మార్పులేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మెదక్‌లో శుక్రవారం ఉపాధ్యాయులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని కిషన్‌రెడ్డి మాట్లాడారు.. అన్ని రంగాల ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలు లో చతికిలపడిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడతామని చెప్పారు. అనేక రాష్ట్రాల్లో మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అవినీతి, అక్రమ ప్రభుత్వాల చేతగాని విధానాల వల్ల కనీసం జీతాలివ్వలేని స్థితిలో అవి కొట్టుమిట్టాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను అప్పులకుప్పగా మార్చాయని ఆరోపించారు.
శాసనమండలి ఎన్నికలు రాష్ట్ర దశ, దిశను సూచించే ఎన్నికలని కిషన్‌రెడ్డి చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.4వేలు, మహిళలకు రూ.2,500, ప్రతీ దళిత కుటుంబానికి రూ.12 లక్షలు, రైతులు, రైతు కూలీలను ఆదుకుంటామన్న హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయన్నా రు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ హామీ లిచ్చి ఇప్పుడు కనీసం వారిని కలవడం కూడా లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్జీతో గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, పార్టీ నేత ప్రభాకర్‌రావు, పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.