21-04-2025 12:06:22 AM
ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): -కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్పా చాతల ప్రభుత్వం కాదు.. రాష్ట్రంలో పాలన పడకేసింది.... ప్రజల బాగోగులు గురించి పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
ఆదివారం ఖమ్మం వచ్చిన ఆమె ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇంటి లో మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మన్ననలు కోల్పోయిందన్నారు. ఈ ప్రభుత్వ ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. సీయం చెప్పిన ఏ ఒక్క పని అమలు చేయలేదన్నారు. రైతుభరోసా ఇంకా పూర్తి కాలేదన్నారు.
రుణమాఫీ కి దిక్కే లేదన్నారు. రుణమాఫీ సంపూర్ణం చేశామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.ప్రతిపక్ష పాత్రను క్రియాశీలకంగా పోషిస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీని ఎంకరేజ్ చేయాలన్నారు.సీయం ఎక్కడున్నా సొంత పార్టీ అగ్రనేతలపై కేసులు పెట్టినా స్పందించలేదన్నారు.
రాష్ట్రంలో అకాల వానలు పడి పంట నష్టపోయి రైతులు అవస్థ పడుతుంటే సీయం కానీ మంత్రులు కానీ కనీసం స్పందించడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ. 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు.
అధికారులను అప్రమత్తం చేయాలన్నారు.ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వనలకు పంటలు తడిసి రైతులు కన్నీళ్లు కారుస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ద్వజమెత్తారు.ఇంత జరిగినా నేటికీ ఒక్క రివ్యూ జరగలేదన్నారు.
డిప్యూటీ సీయం అంటే ఎంత బాధ్యత.. ఆలోచన ఉండాలని అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చాలాయించుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా అని పేరుందని, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు కూడా ప్రశ్నించకపోవడంతో కమ్యూనిజం మీద నమ్మకం సన్నగిల్లిందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వం లో భాగస్వామ్యం కావడం వల్లనే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా? అని అన్నారు.
జనజాతర వరంగల్ సభ
27న జరగబోతున్న వరంగల్ సభ జన జాతరను తలపించబోతుందని కవిత అన్నారు. బీ ఆర్ ఎస్ సభతో తెలంగాణా లో ఒక ఉత్సాహ వాతావరణం ఉందన్నారు. తెలంగాణా జన జాతర.. ఇది మన జాతర అని ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రాబోతున్నారని కవిత అన్నారు.