calender_icon.png 22 November, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభిప్రాయ సేకరణ బూటకం

25-10-2024 01:27:51 AM

  1. రామన్నపేట స్థానికుల అభిప్రాయం తీసుకోలేదు
  2. మంత్రి పొంగులేటి ఒత్తిడి వల్లే సిమెంట్ పరిశ్రమ
  3. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

నల్లగొండ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట-కొమ్మాయిగూడేల మధ్య అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ఈ నెల 23న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పచ్చి బూటకమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. రామన్నపేటలో గురువారం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇతర ప్రాంతాల నుంచి డీసీఎంలలో జనాలను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారమే ఇక్కడ అధికార పార్టీ నేతలు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు పేరుతో అదానీ వద్ద రూ.100 కోట్లు తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి .. అందుకు ప్రతిఫలంగా పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చింది.. ఆ భూములను అదానీకి అప్పగించేందుకేనా అని ప్రశ్నించారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే.. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పెట్టి జనాల ప్రాణాలను తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తున్నదని మండిపడ్డారు.